భారత్‌లో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా ఇన్సూరెన్స్ కవరేజీ కూడా విస్తరించడం చాలా ముఖ్యం. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం దేశీయంగా వాహనం కలిగిన ప్రతి వ్యక్తికి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. యాక్ట్ ఓన్లీ లేదా లయబిలిటీ ఓన్లీ ఇన్సూరెన్స్‌గా కూడా పిలిచే ఈ కవర్ కేవలం చట్టపరమైన అవసరం మాత్రమే కాదు.
ఇన్సూరెన్స్ చేసిన వాహనాన్ని వినియోగించినప్పుడు థర్డ్ పార్టీకి గాయం, మరణం లేదా ఆస్తి నష్టం సంభవించినప్పుడు, చట్టపరంగా, ఆర్థికంగా ఏర్పడే భారాల నుంచి వాహన యజమానికి రక్షణ లభిస్తుంది. ఇటీవల విడుదల చేసిన పార్లమెంటరీ నివేదిక ప్రకారం, 2026 మార్చి నాటికి ’వాహన్’ డేటాబేస్ ప్రకారం ప్రస్తుతం దేశీయంగా రహదార్లపై తిరుగుతున్న వాటిల్లో 45 శాతం వాహనాలకు బీమా లేదు. ఈ నేపథ్యంలోనే వాహనాలకు థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండాలని సుప్రీంకోర్టు కూడా ఇటీవల స్పష్టం చేసింది. టూ–వీలర్లకు కాలపరిమితిని ఆరు సంవత్సరాలకు, ఫోర్–వీలర్లకు నాలుగు సంవత్సరాలకు పొడిగించాలని పేర్కొంది.
ప్రధానంగా మూడు పార్టీలు..
థర్డ్–పార్టీ (టీపీ) బీమా ఒప్పందంలో ప్రధానంగా మూడు పక్షాలు ఉంటాయి. మొదటి పక్షం పాలసీదారు. బీమా పాలసీలో ఎవరి పేరు ఉంటుందో వారే పాలసీదారు. రెండో పక్షం.. పాలసీని అందించే ఇన్సూరెన్స్ కంపెనీ. ఇక మూడో పార్టీ.. అంటే, ఇన్సూరెన్స్ చేసిన వాహనం వల్ల నష్టం లేదా గాయానికి గురయ్యే వ్యక్తి లేదా ఆస్తి. ఇలాంటి సందర్భాల్లో మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం వాహన యజమానిపై పడే భారానికి టీపీ ఇన్సూరెన్స్ కవరేజీ అందిస్తుంది. సాధారణంగా ఎవరైనా వ్యక్తికి సంబంధించిన వాహనం వల్ల థర్డ్ పార్టీకి నష్టం జరిగితే అది కొన్ని సందర్భాల్లో లక్షలు, కోట్ల వరకు కూడా ఊహించని ఖర్చులకు దారి తీయొచ్చు. ఇలాంటి తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని నివారించుకునేందుకు టీపీ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. టీపీ కవర్ ఉన్నంత మాత్రాన వాహనానికి కూడా బీమా ఉన్నట్లు కాదు. దానికోసం ఓన్–డ్యామేజ్ కవర్‌తో సహా సమగ్ర పాలసీ అవసరమవుతుంది.
ఉదాహరణకు, ఒక వ్యక్తికి టీపీ బీమా మాత్రమే ఉందనుకుందాం. అతని కారు ఓ టూ–వీలర్‌ను ఢీకొని, రైడర్‌కు గాయాలై, టూ–వీలర్ దెబ్బతింటే, రూ. 1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తిందనుకుందాం. ఇలాంటి సందర్భంలో ఈ మొత్తాన్ని టీపీ పాలసీ కవర్ చేస్తుంది. అయితే, అతని సొంత కారుకు పడిన డెంట్‌ను మరమ్మతు చేయడానికి అయ్యే ఖర్చును మాత్రం ఇది కవర్ చేయదు. ఇలాంటి నష్టాల నుంచి సొంత వాహనాన్ని రక్షించుకోవడానికి సమగ్ర ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం అవసరం.
దీర్ఘకాలిక పాలసీతో ప్రయోజనాలు..
దీర్ఘకాలిక థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ వాహన యజమానులకు పలు ప్రయోజనాలను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో ప్రీమియం మారుతుందేమో అనే అనిశ్చితి ఉండదు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న క్లెయిమ్‌ల కారణంగా ప్రతి ఏడాది ఖర్చులు పెరిగినా, వాటి ప్రభావం నుంచి రక్షణ లభిస్తుంది. ప్రతి ఏడాది పాలసీని రెన్యూవల్ చేయాల్సిన అవసరం లేకపోవడంతో అదనపు అడ్మిని్రస్టేటివ్ చార్జీలు కూడా తగ్గుతాయి. దీంతో దీర్ఘకాలంలో పాలసీ మరింత ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక కవర్ వల్ల కలిగే సౌలభ్యం కూడా ముఖ్యమైన ప్రయోజనం. ఒకే పాలసీ ఉండటంతో ప్రతి ఏడాది రెన్యువల్ తేదీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిపోతుందేమోననే ఆందోళన, ప్రతి సంవత్సరం పేపర్‌వర్క్ చేసే ఇబ్బంది కూడా ఉండదు. దీంతో అదనపు శ్రమ లేకుండా ఇన్సూరెన్స్‌ను కొనసాగించడం, నిబంధనలను పాటించడం మరింత సులభమవుతుంది.
మొత్తంమీద, దీర్ఘకాలిక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కవరేజీని అందించడంతో పాటు, పాలసీ వ్యవహారాన్ని సులభతరం చేస్తుంది. ఫీచర్ల గురించి ఎక్కువగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా పాలసీని సులభంగా తీసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, సరైన ఇన్సూరెన్స్‌తో పాటు డ్రైవ్ చేసే వారికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు కూడా ఉండాలి. కమర్షియల్ వాహనాలకు అనుమతులు తీసుకోవడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు డ్రైవర్‌తో పాటు రోడ్డుపై ప్రయాణించే ఇతరులకు కూడా భద్రత కల్పిస్తాయి.


