సొంత వ్యాపారం ఉన్న హోల్డింగ్ కంపెనీలే బెటర్
వీటికి వాటాల విలువతో పాటు స్వీయ విలువా ఉంటుంది
ఇన్ఫో ఎడ్జ్‌కు ఇంటర్నెట్ లాభాలతో పాటు వాటాలపై బ్లాక్‌బస్టర్ రాబడి
ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో భవిష్యత్తు అన్‌లాక్‌కు ఎక్కువ అవకాశాలు
కోరమాండల్‌లోని వాటా విలువకంటే తక్కువే ట్రేడవుతున్న ఈఐడీ ప్యారీ
మొత్తం గ్రూపు కంపెనీలను హోల్డ్ చేస్తూనే లీడర్‌గా ఎం అండ్ ఎం
వాటాల విలువను లెక్కలోకి తీసుకోకుండానే... ఎల్ అండ్ టీకి విలువ
హోల్డింగ్ కంపెనీలు డిస్కౌంట్ ధరకే ట్రేడ్ కావటం సాధారణమే
కొనే ముందు వాటి విలువను విశ్లేషించటం తప్పనిసరి
భవిష్యత్తులో అన్‌లాక్ అయ్యే ప్రయోజనాలనూ చూడాలి
హోల్డింగ్ కంపెనీల్ని మార్కెట్ పెద్దగా ఇష్టపడదు. ఎందుకంటే సొంతగా పెద్ద వ్యాపారమేదీ ఉండదు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి... వాటిపై వచ్చే డివిడెండ్లే ఆదాయంగా నెట్టుకొస్తూ ఉంటాయి. ఆ వాటాల విలువ పెరిగితే... ఈ కంపెనీల విలువా పెరుగుతుంది. అంతే. కాబట్టే నేరుగా వ్యాపారం చేసే కంపెనీల షేర్లపైనే ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
మరి సొంతగా మంచి వ్యాపారం చేస్తూనే, ఇతర సంస్థల్లోనూ వాటాలున్న కంపెనీల సంగతేంటి? ఒకవైపు ప్రధాన వ్యాపారం నుంచి ఆదాయం వస్తుంది. మరోవైపు పెట్టుబడులపై డివిడెండ్లూ వస్తాయి.
భవిష్యత్తులో ఆ కంపెనీల వాటా విలువ పెరిగితే... అదో అదనపు ప్రయోజనం. వీటన్నిటికీ తోడు... ఇలాంటి కంపెనీలు కొన్నిసార్లు వాటి మొత్తం ఆస్తుల విలువతో పోలిస్తే (బుక్ వేల్యూ) మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంటాయి. అంటే.. వ్యాపారమూ ఉంది. పెట్టుబడులూ ఉన్నాయి. భవిష్యత్తులో విలువ అన్‌లాక్ అయ్యే అవకాశమూ ఉంది. కాబట్టి ఇవి సాధారణ హోల్డింగ్ కంపెనీలు కావు. వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీలు. ఇలాంటి కంపెనీల గురించి వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...
ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్... ఇన్ఫో ఎడ్జ్... ఈఐడీ ప్యారీ... మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రెజ్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టూబ్రో... ఇవన్నీ ఇన్వెస్టర్లకు సుపరిచితమైన కంపెనీలే. విశేషమేంటంటే ఇన్వెస్టర్లు చాలామంది వీటి ప్రధాన వ్యాపారాన్నే చూస్తుంటారు. ఎప్పటికప్పుడు అవి ప్రకటించే ఫలితాలను విశ్లేషిస్తుంటారు. కానీ వీటికి రకరకాల కంపెనీల్లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ల సంగతేంటి? ఆ కంపెనీల్లో వాటాల విలువ మాటేంటి? ఆ విలువంత ఈ కంపెనీ షేర్లలో ప్రతిఫలిస్తోందా? అనేది పెద్దగా చూడరు. అలా చూసి ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మెరుగైన రాబడులొస్తాయనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ కంపెనీల షేర్లను కొంటే... వాటికి ఇన్వెస్ట్‌మెంట్లున్న మొత్తం ఎకో సిస్టమ్‌లో పెట్టుబడి పెట్టినట్లే. కాబట్టి దాని విలువ పెరిగే అవకాశాలూ ఎక్కువే. ఇలాంటి కంపెనీల గురించి వివరంగా చూద్దాం.
ది ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా
వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీకి అచ్చమైన ఉదాహరణ మురుగప్ప గ్రూప్‌నకు చెందిన ఈ ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఎందుకంటే బీఎస్‌ఏ ఎస్‌ఎల్‌ఆర్‌తో పాటు మోంట్రా, హెర్క్యులిస్ వంటి సైకిళ్లన్నీ ఈ కంపెనీ బ్రాండ్లే. వీటి తయారీతో పాటు లిస్డెట్ కంపెనీలైన సీజీ పవర్, శాంతి గేర్స్‌లో దీనికి మెజారిటీ వాటాలున్నాయి. శాంతి గేర్స్‌ను ఈ మధ్యనే డీలిస్ట్ చేశారు కూడా. వీటితో పాటు మోంట్రా ఎలక్ట్రిక్, క్లీన్ మొబిలిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థల్లో మెజారిటీ వాటాలున్నాయి. సైకిళ్లతో పాటు ఇంజినీరింగ్, మెటల్ ఉత్పత్తులు, మొబిలిటీ, ఈవీ, పారిశ్రామిక పరికరాల తయారీని వంటి వ్యాపారాలను కంపెనీ నేరుగా నిర్వహిస్తోంది కూడా.
ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రస్తుతం సీజీ పవర్ మార్కెట్ విలువ ఒక్కటే ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్ విలువను దాటేసింది. మరి సీజీ పవర్‌లో దాదాపు 56 శాతానికి పైగా వాటా కలిగి ఉన్న ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు... ఇతర కంపెనీల్లోని వాటాలను, సొంత వ్యాపారాలను జోడిస్తే విలువ పెరుగుతుంది కదా? అంటే హోల్డింగ్ కంపెనీ తరహాలో మార్కెట్ దీనికి తక్కువ విలువే ఇస్తోందని స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ అన్‌లిస్టెడ్ కంపెనీలు లిస్ట్ అయినా... వాటి విలువ పెరిగినా ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ షేరు ధర కూడా పెరుగుతుందనటంలో అతిశయోక్తి లేదు కదా? అందుకే దీన్ని ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన వ్యూహాత్మ హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు.
ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా)
నౌఖ్రీ, 99 ఏకర్స్, జీవన్‌సాథీ, శిక్షా వంటి ఇంటర్‌నెట్ సంస్థలు ఈ కంపెనీ సొంతం. ఇవన్నీ ఆయా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నవే. మంచి ఆదాయాన్ని సాధిస్తున్నవే. ఏఐ వచ్చాక వీటి వ్యాపారాలు కొద్దిమేరకు తగ్గుతున్న మాట వాస్తవమే అయినా... ఏఐలో ఇన్వెస్ట్‌మెంట్లు చేయటం ద్వారా కంపెనీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది.
పైపెచ్చు జొమాటో, పాలసీ బజార్, అడ్డా 247, షాప్ కిరాణాతో సహా బోలెడన్ని స్టార్టప్స్‌లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. జొమాటో, పాలసీ బజార్‌లో ఈ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్లు ఇప్పటికే బ్లాక్ బస్టర్ ఫలితాలనిచ్చాయి. మిగతా వాటిలోనూ కొన్నింటి విలువ బాగా పెరిగింది. ఒకరకంగా దీన్ని లిస్టెడ్ వెంచర్ క్యాపిటల్ ప్లాట్‌ఫామ్‌గా భావించవచ్చు. దాంతోపాటు లాభాలిచ్చే అర్థవంతమైన వ్యాపారాలూ ఉన్నాయి. అందుకే ఈ కంపెనీ షేరు బాగా పెరిగి... ప్రస్తుతం ఏఐ బూమ్‌లో కొంత కరెక్షన్‌కు గురైంది.
ఈఐడీ ప్యారీ.. తక్కువ ధరకే..?
ఈ కంపెనీని చాలామంది షుగర్ తయారీ కంపెనీగానే చూస్తారు. చక్కెర, బెల్లం, న్యూట్రాస్యూటికల్స్, బయో ఉత్పత్తుల్ని విక్రయించే ఈ కంపెనీకి సొంత చక్కెర రిఫైనరీ ఉంది. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉంది. వీటన్నిటినీ మించి... ఎరువుల తయారీలో అగ్రగామి అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్‌లో ఈ కంపెనీకి దాదాపుగా 56 శాతానికిపైగా వాటా ఉంది. ఆ వాటా విలువ ఒక్కటే దాదాపుగా రూ.35వేల కోట్లు. పైపెచ్చు ఇండియన్ పొటాష్ కంపెనీలో సైతం దాదాపుగా రూ.400 కోట్ల విలువైన వాటాలున్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఈఐడీ ప్యారీ షేరు ధర తక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈఐడీ ప్యారీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపుగా రూ.13వేల కోట్ల దగ్గర్లో ఉంది. మరి కోరమాండల్‌లో రూ.35వేల కోట్లు, ఇండియన్ పొటాష్ లో రూ.400 కోట్ల పెట్టుబడులతో పోల్చినా ఇది తక్కువే కదా? పైపెచ్చు షుగర్ కంపెనీగా దేశవ్యాప్తంగా చక్కటి వ్యాపారం ఉంది. లాభాలు ఆర్జిస్తోంది. అందుకే వ్యూహాత్మక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇలాంటి సంస్థలు మెరుగైనవన్నది నిపుణుల సూచన.
మహీంద్రా అండ్ మహీంద్రా...
ఎం అండ్ ఎం మాత్రం వీటన్నింటికీ భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే దీనికి హోల్డింగ్ కంపెనీగా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులతో పాటు... బలమైన వ్యాపారమూ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సరీ్వసెస్, మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, స్వరాజ్ ఇంజిన్స్ లిమిటెడ్, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్ లిమిటెడ్, ఎస్‌ఎంఎల్ ఇసుజు వంటి లిస్టెడ్ కంపెనీల్లో మెజారిటీ వాటాలు ఎం అండ్ ఎం సొంతం. ఇక టెక్ మహీంద్రా, సీఐఈ ఆటోమోటివ్ ఎగ్జిట్‌లో మైనారిటీ వాటాలున్నాయి. ఇవికాక చాలా అన్‌లిస్టెడ్ సంస్థలు దీనికి నూరుశాతం అనుబంధ కంపెనీలుగా ఉన్నాయి.
ఈ పెట్టుబడులు, వాటాలను పక్కనబెడితే... ఎం అండ్ ఎం వాహనాల తయారీలో అగ్రగామి. ట్రాక్టర్లలో లీడర్. ఈవీ మొబిలిటీలో కంపెనీ వేగంగా ఎదుగుతోంది. అంటే.. ఒక ఎం అండ్ ఎం షేరు కొంటే దాదాపుగా కంపెనీకి చెందిన గ్రూపు సంస్థలన్నింటినీ హోల్డ్ చేస్తున్నట్లే లెక్క. భవిష్యత్తులో వీటి వాటాల విలువ పెరగటంతో పాటు అన్‌లిస్టెడ్ కంపెనీలు కూడా లిస్టయితే ఎం అండ్ ఎం విలువ కూడా పెరుగుతుంది కదా!. అందుకే దీన్ని వ్యూహాత్మక ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు.
లార్సన్ అండ్ టూబ్రో
ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో ఇది లీడర్. ఈపీసీ కాంట్రాక్టుల్లో అగ్రగామి. మెట్రో రైళ్లతో సహా భారీ నిర్మాణాల్లో కంపెనీది తిరుగులేని రికార్డు. వీటన్నిటితో పాటు ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఫైనాన్స్, ఎల్ అండ్ టీ సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ వ్యాపారాల్లో మెజారిటీ వాటాలున్నాయి. ప్రస్తుత విలువను బట్టి చూస్తే ఎల్ అండ్ టీ షేరును దాని వాస్తవ వ్యాపారాన్ని బట్టే విలువ కడుతున్నారన్నది నిపుణుల మాట. మరి దీని వాటాల విలువను కూడా లెక్కిస్తే!!. భవిష్యత్తులో కూడా ఈ విలువలు పెరుగుతూ ఉంటాయి కనక దీన్ని వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.
ఇవే కాదు. ఇలా విశ్లేషిస్తూ వెళితే చాలా హోల్డింగ్ కంపెనీలు ఇన్వెస్ట్‌మెంట్‌కు తగినవిగానే కనిపిస్తాయి. గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ను తీసుకుంటే దీనికి ఓలియో కెమికల్స్, కెమికల్స్ వ్యాపారాలతో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్, గోద్రెజ్ ప్రాపర్టీస్ సహా ఇతర గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్‌కు సొంత వ్యాపారాలతో పాటు కిర్లోస్కర్ గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కల్యాణి ఇన్వెస్ట్‌మెంట్స్, మహారాష్ట్ర స్కూటర్స్, కేశోరామ్ ఇండస్ట్రీస్.. వీటన్నిటిదీ ఇదే స్టోరీ. కేశోరామ్ ఎప్పటికప్పుడు తన ఇన్వెస్ట్‌మెంట్లను అన్‌లాక్ చేస్తూ షేర్ హోల్డర్ల వాటా విలువ పెంచు
తోంది. కాబట్టి ఇవన్నీ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవాల్సినవే.
హోల్డింగ్‌కంపెనీలు తక్కువ ధరకే ఎందుకు వస్తాయంటే...
→ క్యాపిటల్ గెయిన్స్ పన్నును కూడా మార్కెట్లు పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే ఒక కంపెనీకి వేరొక కంపెనీలో ఉన్న మొత్తం వాటాను విక్రయించేసిందనుకోండి. ఆ వచి్చన సొమ్ముపై దాదాపు 12.5 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను చెల్లించాలి. అంటే ఆ మేరకు వాటాల విలువను తక్కువగానే చూడాలి కదా!.
→ హోల్డింగ్ కంపెనీలు తమ వాటాలను విక్రయించటం అంత తేలికకాదు. దాదాపుగా అసాధ్యం కూడా. మరి హోల్డింగ్ చేయటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులున్నపుడు వాటికి పూర్తిగా విలువ కట్టడమెందుకన్నది మార్కెట్ భావన. అందుకే హోల్డింగ్ కంపెనీలు దాదాపుగా వాటి విలువకన్నా 30–40 శాతం తక్కువకే ట్రేడవుతూ ఉంటాయి.
→ కాబట్టి ఇన్వెస్టర్లు వీటిని విశ్లేషించేటపుడు దానికి లిస్టెడ్ కంపెనీల్లో ఉన్న వాటాల విలువెంత? అన్‌లిస్టెడ్ సంస్థల్లో ఉన్న వాటాల విలువెంత? సొంతగా అది చేస్తున్న వ్యాపార విలువెంత? అనేది చూడాలి. క్యాష్– ఇన్వెస్ట్‌మెంట్లు– రుణాలు, హోల్డింగ్ కంపెనీకి మార్స్క్ ఇచ్చే 30–40% డిస్కౌంట్ అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే ఆ కంపెనీ విలువను నిర్ణయించుకోవాలి. అప్పటికీ తక్కువ ఉంటే... దాన్ని తక్షణ ఇన్వెస్ట్‌మెంట్‌కు తగ్గట్టుగా చూడొచ్చు. లేనిపక్షంలో భవిష్యత్తులో అన్‌లాక్ అయ్యే విలువను దృష్టిలో పెట్టుకుని అందులో పెట్టుబడి పెట్టొచ్చు.
రమణమూర్తి మంథా


