పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ | Telangana as an investment destination says Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ

Sep 24 2026 5:39 AM | Updated on Sep 24 2026 5:39 AM

Telangana as an investment destination says Bhatti Vikramarka

ఆ లక్ష్యంతో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు  

ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే చరిత్రాత్మక ఘట్టం 

దేశ, విదేశాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయం 

డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష 

మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, అజహరుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌ హాజరు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్‌ 7–9 మధ్య నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026 ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే ఈ చరిత్రాత్మక ఘట్టంలో అధికారులంతా భాగస్వాములై సమ్మిట్‌ను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ‎‎సచివాలయంలో బుధవారం జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, అజహరుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, ప్రచారం, రోడ్‌షోల నిర్వహణపై డిప్యూటీ సీఎం పక్కా కార్యాచరణను ఖరారు చేశారు.

రోజూ వార్తల్లో మారుమోగాలి  
సమ్మిట్‌ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బల మైన పునాదులు వేయాలని భట్టి పిలుపునిచ్చారు. సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులతో 10 కమిటీలను ఏర్పా టు చేశామని, ప్రతి కమిటీకి ఒక సీనియర్‌ అధికారి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. అధికారుల కమిటీలతోపాటు ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిళ్లను ఏర్పాటు చేసి, వాటికి సంబంధిత మంత్రులను చైర్‌పర్సన్లుగా నియమించినట్టు తెలిపారు. 

ప్రతి కమిటీకి కన్వీనర్లను నియమించామని, వారు వెంటనే సంబంధిత మంత్రులను కలిసి బాధ్యతలు స్వీకరించి పనులు ప్రారంభించాలన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రింట్, ఎల్రక్టానిక్, డిజిటల్, సోషల్‌ మీడియా వేదికలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. గురువారం నుంచే ప్రతిరోజూ సదస్సుకు సంబంధించిన ఏదో ఒక వార్త మారుమోగాలన్నారు.పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.‎‎  

విదేశాల్లో రోడ్‌షోలు.. 
గతంలో కుదిరిన ఎంఓయూలను కూడా సమీక్షించి, వాటి అమలు పురోగతిని పరిశీలించాలని అధికారులను భట్టి ఆదేశించారు. ‎తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాలు, నగరాలు, రంగాలను గుర్తించి దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించేందుకు స్పష్ట మైన యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలన్నారు. ఏ దేశంలో ఏ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయో అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా రోడ్‌షోల ప్రణాళిక రూపొందించి మంత్రిమండలి ఉపసంఘానికి నివేదించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే తమ టీమ్‌లతో సమా వేశమై వార్‌ రూమ్‌ ద్వారా పనులను పర్యవేక్షించాలని, ప్రతిరోజూ సాయంత్రం పనుల పురోగతిని తనిఖీ చేసిన తర్వాతే రోజువారీ బాధ్యతలు ముగించాలని చెప్పారు. ప్రతినిధుల స్పందనను బట్టి అవసరమైతే ప్రస్తుతం అనుకుంటున్న 4 సభా ప్రాంగణాలను 6 లేదా 8కి పెంచేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.  

సంస్కృతి ప్రతిబింబించేలా: శ్రీధర్‌బాబు 
పెట్టుబడుల సమీకరణకే పరిమితం కాకుండా, తెలంగాణ సంప్రదాయాలు, సాంస్కృతిక విశిష్టతలను ప్రపంచానికి చాటిచెప్పేలా సమ్మి ట్‌ ఉండాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫైవ్‌స్టార్‌ హోటళ్ల వాతావరణం దేశవ్యాప్తంగా ఎక్క డైనా సాధారణంగానే ఉంటుందని, అయితే మన రాష్ట్ర ప్రత్యేకతను విదేశీ, జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడి వంటకాలు ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారిణి హరిచందనకు సూచించారు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement