రెండు డీఏలకు ఓకే | TGEJAC welcomes Telangana government decisions | Sakshi
Sakshi News home page

రెండు డీఏలకు ఓకే

Sep 24 2026 1:33 AM | Updated on Sep 24 2026 1:33 AM

TGEJAC welcomes Telangana government decisions

డిప్యూటీ సీఎం భట్టితో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టీజీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు

దసరాలోపు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం 

ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం

సంక్రాంతికి మరో డీఏ విడుదల

ప్రభుత్వ నిర్ణయంపై సుముఖత వ్యక్తం చేసిన టీజీఈజేఏసీ 

అతి త్వరలో పీఆర్‌సీ నివేదిక... వేగవంతంగా ఫిట్‌మెంట్‌ ఖరారు 

మార్చిలోపు పెండింగ్‌ బిల్లులను పరిష్కరించేలా చర్యలు  

ప్రస్తుతం ఇస్తున్న రూ.వెయ్యి కోట్లకు మరిన్ని నిధులు 

సంక్రాంతికి మరో డీఏ ఇస్తామని ప్రభుత్వం హామీ... 

ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించిన టీజీఈజేఏసీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగ జేఏసీ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగలోపు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా సంక్రాంతి పండుగకు మరో డీఏ కూడా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆధ్వర్యంలో జరిగిన చర్చలు ఉద్యోగ సంఘాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అర్ధంతరంగానే బయటకు వచ్చారు. టీజీఈజేఏసీ నేతలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని నిరసనలు, ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంది. వెంటనే సీఎం క్యాంపు కార్యాలయానికి రావాలని సూచించడంతో ఉద్యోగ సంఘాల నేతలు వెంటనే ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌కు చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్‌హర్‌ మహేశ్‌ దత్‌ ఎక్కా ఆధ్వర్యంలో టీజీఈజేఏసీతో చర్చలు జరిగాయి. చర్చల అనంతరం టీజీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. చర్చలకు సంబంధించిన అంశాలను వివరించారు. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూనే ప్రభుత్వం అనుకూలతల దృష్ట్యా నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. 

మరింత అదనంగా నిధులు 
పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరగా... పక్షం రోజుల్లో ఈ నివేదిక తెప్పించుకుంటామని, వీలైనంత వేగంగా నివేదికను పరిశీలించి ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం నెలవారీగా రూ.వెయ్యి కోట్లను విడుదల చేస్తోంది. ఈ నిధులను పెంచాలని కోరగా... ప్రభుత్వం కొంత వెసులుబాటు చేసుకుంటూ ప్రస్తుతం ఇస్తున్న నిధులకు మరిన్ని నిధులు జోడించి విడుదల చేస్తామని చెప్పింది. మార్చి ఆఖరులోపు ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలు పూర్తిస్థాయిలో విడుదల చేస్తామని వెల్లడించారు. సీపీఎస్‌ రద్దుకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎస్‌ ఉద్యోగ సంఘాలకు తెలపగా... ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి ముందు సీఎస్‌ ప్రకటించారు. ప్రస్తు తం రెండు డీఏలు దసరా పండుగలోపు ఇస్తామని చెబుతూనే... మరో డీఏ సంక్రాంతి పండుగకు ఇస్తామని వివరించారు. టీజీఈజేఏసీ ప్రధానంగా ప్రతిపాదించిన డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తూ నిర్ణయాలు ప్రకటించడంతో ఉద్యోగ సంఘాల నేతలు శాంతించారు.  

క్షేత్రస్థాయి నుంచి తీవ్ర ఒత్తిడి 
టీజీఈజేఏసీపై క్షేత్రస్థాయి నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో నేతలు వెనక్కు తగ్గుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీజీఈజేఏసీ కూడా పలుమార్లు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం... తిరిగి వెనక్కి తగ్గి చర్చలవైపు దృష్టి పెట్టడంపై క్షేత్రస్థాయిలో ఉద్యోగుల్లో చులనక భావం పెరిగింది. దీంతో తాడోపేడో తేల్చుకుందామని ఒత్తిడి చేశాయి. దీంతో ఈనెల 10న చలో హైదరాబాద్‌ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో చలో హైదరాబాద్‌ను వాయిదా వేయడం పట్ల ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘాల నేతలపైనా ఇష్టానుసారంగా విమర్శలు గుప్తిస్తూ సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. తాజాగా ప్రభుత్వం రెండు డీఏలపై స్పష్టమైన హామీ ఇవ్వడం... మిగిలిన అంశాలపై దాటవేత ధోరణి ప్రదర్శించిందంటూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో గురువారం టీఎన్జీఓ భవన్‌లో జరగాల్సిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని రద్దు చేయగా... ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీలు రాకముందే నిర్ణయాలను వాయిదా వేసుకోవడంపైనా ఉద్యోగులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement