సాక్షి,హైదరాబాద్: నగరంలో వైభవంగా జరుగుతున్న వినాయక ఉత్సవాల ముగింపు వేడుకలకు, ఈ నెల 25న శుక్రవారం జరగనున్న మహానిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. మూడో రోజు నుంచే ప్రారంభమైన విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే నగరంలో ప్రశాంతంగా సాగుతుండగా, చివరి రోజు బాలాపూర్ గణేశ్ నుంచి జరిగే తుది శోభాయాత్రను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవంతంగా పూర్తిచేసేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, పొరుగు జిల్లాల నుంచి పోటెత్తే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ బందోబస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సమగ్ర ముందస్తు కసరత్తు.. శాఖల సమన్వయం, ఉత్సవాల నిర్వహణ కోసం మూడు నెలల ముందు నుంచే పకడ్బందీ కసరత్తు చేశారు. ధూల్‌పేట్, లక్ష్మీదేవిగూడ విగ్రహ తయారీదారులతో పాటు జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి, అగ్నిమాపక, హైడ్రా తదితర ప్రభుత్వ విభాగాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పలుమార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో 14,929 మండపాలకు అనుమతులు మంజూరు చేసి, జియో ట్యాగింగ్ చేశారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన 32,878 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
అత్యాధునిక సాంకేతికతతో నిఘా
శోభాయాత్రను క్షణక్షణం పర్యవేక్షించేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దించారు. ఊరేగింపు సాగే మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించగా, 24 డ్రోన్లు, దాదాపు 100 హైరైజ్ కెమెరాలను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. ప్రధాన జలాశయాల వద్ద గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు.
20 వేల మందితో పహారా.. కేంద్ర బలగాల మోహరింపు
శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ కమిషనరేట్ నుంచి దాదాపు 20 వేల మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 8,142 మంది సిబ్బందితోపాటు 4 రాపిడ్ యాక్షన్ ఫోర్స్(RAF) కంపెనీలు, 2 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు, 53 బీడీ టీంలను మోహరించారు.
నిబంధనలు కఠినతరం..
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, సౌండ్ మిక్సర్లు, అధిక శబ్దాలు చేసే పరికరాలు, బాణసంచా కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే పరికరాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం 26 షీ-టీమ్స్ బృందాలు విధుల్లో ఉంటాయి. ఆపదలో ఉంటే డయల్ 112 లేదా షీ-టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555ను సంప్రదించాలని సూచించారు.
సీపీ సజ్జనార్ విజ్ఞప్తి
నగర ప్రజలంతా సంయమనం పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ వీసీ సజ్జనార్ కోరారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, పుకార్లు సృష్టించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ విశిష్ట సంస్కృతి అయిన ‘గంగా-జమునా తెహజీబ్’ను కాపాడుకుంటూ పోలీసులకు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


