సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న (శుక్రవారం) గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఆ రోజు సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. విద్యాలయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఆ రోజు హాలిడే తీసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 25కు బదులుగా నవంబర్ 14న వర్కింగ్ డేగా ప్రకటించింది.
కాగా ఈ నెల 25న శుక్రవారం జరగనున్న మహానిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, పొరుగు జిల్లాల నుంచి పోటెత్తే లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ బందోబస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సమగ్ర ముందస్తు కసరత్తు.. శాఖల సమన్వయం, ఉత్సవాల నిర్వహణ కోసం మూడు నెలల ముందు నుంచే పకడ్బందీ కసరత్తు చేశారు.
నగర పోలీసులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో 14,929 మండపాలకు అనుమతులు మంజూరు చేసి, జియో ట్యాగింగ్ చేశారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాలకు చెందిన 32,878 విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
20 వేల మందితో పహారా.. కేంద్ర బలగాల మోహరింపు
శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ కమిషనరేట్ నుంచి దాదాపు 20 వేల మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 8,142 మంది సిబ్బందితోపాటు 4 రాపిడ్ యాక్షన్ ఫోర్స్(RAF) కంపెనీలు, 2 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు, 53 బీడీ టీంలను మోహరించారు.


