2030కల్లా పేదరిక రహిత తెలంగాణ | Decisions taken at a high level meeting chaired by Deputy Chief Minister Bhatti | Sakshi
Sakshi News home page

2030కల్లా పేదరిక రహిత తెలంగాణ

Sep 25 2026 5:18 AM | Updated on Sep 25 2026 5:18 AM

Decisions taken at a high level meeting chaired by Deputy Chief Minister Bhatti

2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ 

రాష్ట్ర అభివృద్ధికి కొత్త కార్యాచరణ.. టీఎస్‌డీపీఎస్‌కు ప్రత్యేక పీఎంయూ 

జిల్లాలవారీగా అభివృద్ధి ప్రణాళికలు.. ఏడు గ్రోత్‌ ల్యాబ్‌లు 

ఉప ముఖ్యమంత్రి భట్టి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను 2030 నాటికి పేదరికంలేని రాష్ట్రంగా.. 2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ దిశగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమగ్ర, దీర్ఘకాలిక అభివృద్ధి కార్యాచరణను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అంశంపై గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను మరింత సమర్థంగా అమలు చేయడం, శాఖల మధ్య సమన్వయం పెంచడం, అభివృద్ధి ఫలితాలను నిరంతరం పర్యవేక్షించడంపై చర్చించారు. ఏపీ మాజీ సీఎస్, హైదరాబాద్‌కు చెందిన గ్రోత్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ) వైస్‌ చైర్మన్‌ ఎస్‌.పి. టక్కర్, ఆర్థిక, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు.  

టీఎస్‌డీపీఎస్‌కు ప్రత్యేక విభాగం 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (టీఎస్‌డీపీఎస్‌)ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ (పీఎంయూ) ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించడం, శాఖల మధ్య సమన్వయం, పనుల అమలు, పురోగతిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను ఈ విభాగం చూస్తుంది. 

2030 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలను అందించడంతోపాటు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టనున్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎంత వరకు ఫలితాలు ఇస్తున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 

2033 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను పెంచే మార్గాలను గుర్తించనున్నారు. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందేలా సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాల స్థాయిలో సాధించేలా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనున్నారు. ప్రతి జిల్లాకు స్పష్టమైన లక్ష్యాలు, వాటిని సాధించే గడువు, కేటాయించే నిధులు, సాధించిన ఫలితాలను చూపించే విధానం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. జిల్లాల అభివృద్ధి పురోగతిని డ్యాష్‌బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోనున్నారు. 

ఏడు రంగాల్లో గ్రోత్‌ ల్యాబ్‌లు 
అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు ఏడు రంగాలకు సంబంధించి గ్రోత్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక వసతులు–రవాణా, ఆరోగ్యం, పర్యాటకం, పశు సంపద–ఆక్వా కల్చర్, పట్టణీకరణ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అంశాలపై ఇవి పనిచేయనున్నాయి. ప్రభుత్వ శాఖలతోపాటు పరిశ్రమలు, విద్యాసంస్థలు, నిపుణులు, అభివృద్ధి సంస్థలను ఈ వేదికల్లో భాగస్వాములను చేయనున్నారు. ఆయా రంగాల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించడం, కొత్త అవకాశాలను గుర్తించడం, వాటిని కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలుగా మార్చడం గ్రోత్‌ ల్యాబ్‌ల ఉద్దేశం. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిపుణులు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. 

జీఎఫ్‌ఎస్‌టీతో భాగస్వామ్యం 
వ్యూహాత్మక ప్రణాళిక, డేటా ఆధారిత నిర్ణయాలు, సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం, పర్యవేక్షణ తదితర అంశాల్లో గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ)తో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ భేటీలో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం–జీఎఫ్‌ఎస్‌టీ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని పరిశీలించనుంది. తద్వారా అభివృద్ధి కార్యక్రమాలను పథకాల అమలుకే పరిమితం చేయకుండా లక్ష్యాలు, గడువులు, ఫలితాల ఆధారంగా పర్యవేక్షించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.  

తెలంగాణను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ‎గురువారం ప్రజాభవన్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి సమీక్షించారు. పర్యాటక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతోపాటు ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలని, పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌íÙప్‌ విధానంలో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకుండా పర్యాటక శాఖకు చెందిన ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. 

భవనాలున్న ఆస్తులు, ఖాళీ స్థలాలు, పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజం, హిల్‌ టూరిజం తదితర విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని అధికారులకు భట్టి సూచించారు. రామప్ప వంటి చారిత్రక ప్రదేశాల్లో పరిరక్షణ, నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రభుత్వ సహకారం అందిస్తొమన్నారు. ‎విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంచేందుకు ‘తెలంగాణ దర్శిని’కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ఉప్పల్, ఆర్థిక శాఖ కార్యదర్శి సిక్తా పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement