విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో సీఎస్ సంజయ్‌జాజు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు రామకృష్ణారావు తదితరులు
జీ9 బొగ్గు లభ్యత లేకపోతే అదే సాంకేతికతతో ప్లాంట్ ఎందుకు నిర్మించారు?
బొగ్గు సరఫరాతో రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనపు భారం
దసరాలోపు పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగకపోవడానికి కారణాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో బుధవారం విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణం, బొగ్గు లభ్యత, రవాణా వ్యయం, సింగరేణి పరిస్థితులు, రాష్ట్రంపై పడుతున్న అదనపు ఆర్థిక భారం తది తర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
జీ9 బొగ్గు అవసరం
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి జీ9 నాణ్యత కలిగిన బొగ్గు అవసరమని అధికారులు సమీక్షలో వివరించారు. అయితే సింగరేణి బొగ్గు గనుల్లో ప్రస్తుతం జీ9 బొగ్గును ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని తెలిపారు. సమీప భవిష్యత్తులో సింగరేణి నుంచి జీ9 బొగ్గు అందుబాటులోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై సీఎం, డిప్యూటీ సీఎం తీవ్రంగా ప్రశ్నించినట్లు తెలిసింది. జీ9 బొగ్గు లభ్యతే సమస్యగా ఉన్నప్పుడు అదే నాణ్యతకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని అధికారుల నుంచి వివరాలు కోరారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో బొగ్గు లభ్యత, భవిష్యత్తులో అవసరాలు, రవాణా వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా? లేకపోతే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినట్లు సమాచారం. సాగుకు కేవలం సోలార్ విద్యుత్ మాత్రమే సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం డిస్కంలకు సూచించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
పిట్‌హెడ్ విధానంపై ప్రశ్నలు
సాధారణంగా బొగ్గు గనుల సమీపంలోనే థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బొగ్గు రవాణా వ్యయం తగ్గుతుంది. దీనినే పిట్‌హెడ్ విధానం అంటారు. అయితే యాదాద్రి థర్మల్ కేంద్రాన్ని బొగ్గు గనులకు దూరంగా ఎందుకు ఏర్పాటు చేశారనే అంశంపైనా సీఎం, డిప్యూటీ సీఎం అధికారులను నిలదీశారు. యాదాద్రి ప్లాంట్‌ను పిట్‌హెడ్ ప్రాంతంలో కాకుండా దూరంగా ఏర్పాటు చేయడం వల్ల బొగ్గును రైలు, ఇతర రవాణా మార్గాల ద్వారా తరలించాల్సి వస్తోందని, దీంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని అధికారులు వివరించినట్లు తెలిసింది. ప్లాంట్ నిర్మాణ సమయంలోనే ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా? దూరంగా నిర్మించడం వల్ల రాష్ట్రానికి దీర్ఘకాలంలో ఎంత అదనపు భారం పడుతుందనే దానిపైనా వివరాలు సమర్పించాలని సీఎం సూచించారు.
రాజకీయ కారణాలతోనేనా?
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పిట్‌హెడ్ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా దూరంగా నిర్మించడానికి గతంలో రాజకీయ కారణాలే ప్రధానంగా ఉన్నాయని అధికారులు సమీక్షలో వెల్లడించినట్లు సమాచారం. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం మరిన్ని వివరాలు అడిగినట్లు తెలిసింది. బొగ్గు గనుల నుంచి దూరంగా ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం బొగ్గు రవాణా, సరఫరా వ్యయం రాష్ట్ర ఖజానాపై భారంగా మారిందని అధికారులు వివరించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గును తరలించి సరఫరా చేయడం వల్ల తెలంగాణపై రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు సమీక్షలో తెలిపారు. బొగ్గు ధరతోపాటు రవాణా, ఇతర సంబంధిత ఖర్చులు కూడా విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతున్నట్లు వివరించారు. ఇంత భారీ ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో బొగ్గును సమకూర్చుకునే మార్గాలను అన్వేíÙంచాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దీర్ఘకాలిక బొగ్గు సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.
సింగరేణి నుంచి జీ9పై ఆరా
సింగరేణి నుంచి యాదాద్రికి అవసరమైన జీ9 బొగ్గును సమకూర్చే అవకాశాలపై సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. సింగరేణిలో జీ9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు ప్రస్తుతం లేకపోవడంతో తక్షణ సరఫరా సాధ్యం కాదని అధికారులు తెలిపారు. కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధి, వేలం ప్రక్రియ తదితర అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం వల్ల అవసరమైన నాణ్యత కలిగిన బొగ్గును సింగరేణి నుంచి సమకూర్చుకునే పరిస్థితి ఏర్పడలేదని అధికారులు వివరించినట్లు సమాచారం. ఇప్పటికే సింగరేణిలో 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని కూడా అధికారులు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో బొగ్గు కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.
కోల్ ఇండియా నుంచి కొనుగోలు
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్నందున తక్షణమే ప్రత్యామ్నాయ బొగ్గు వనరులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. యాదాద్రి థర్మల్ కేంద్రానికి అవసరమైన బొగ్గు నిరంతరంగా అందేలా సరఫరా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని బొగ్గు కేటాయింపులు, సరఫరా అంశాలను వేగంగా పరిష్కరించుకోవాలని సీఎం సూచించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో తక్షణమే చర్చించాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు సూచించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం నుంచి సహకారం పొందేందుకు చర్చలు జరపాలని ఆదేశించారు.
దసరాలోపు పూర్తి ఉత్పత్తి
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి సామర్థ్యంతో నడపడం అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. దసరాలోపు యాదాద్రి థర్మల్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు లభ్యత, రవాణా, సాంకేతిక సమస్యలు, ప్లాంట్ నిర్వహణ తదితర అంశాలను సమన్వయం చేసుకుని నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను అందుబాటులో ఉంచడంతోపాటు భవిష్యత్తులో బొగ్గు సరఫరా సమస్యలు తలెత్తకుండా దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


