వెంటిలేటర్‌పై విద్యుత్‌ వ్యవస్థ | Power cuts in the state have increased since Congress came to power says ktr | Sakshi
Sakshi News home page

వెంటిలేటర్‌పై విద్యుత్‌ వ్యవస్థ

Sep 24 2026 5:36 AM | Updated on Sep 24 2026 5:36 AM

Power cuts in the state have increased since Congress came to power says ktr

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ కోతలతో తెలంగాణ అల్లాడుతోంది: కేటీఆర్‌ 

ఎల్‌నినో వల్ల కాదు.. ఎల్‌ కాంగోతోనే... 

యాదాద్రిలో 4 వేల మెగావాట్లకు 400 మెగావాట్లే ఉత్పత్తి..  

నాణ్యత లేని బొగ్గుతో రూ.2,900 కోట్ల నష్టం 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ వెంటిలేటర్‌ మీద ఉందని ధ్వజమెత్తారు. కొన్ని ప్రాంతాల్లో రోజుకు ఆరు గంటలకు మించి సరఫరా లేని పరిస్థితి ఉందన్నారు. ‘కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ రంగంపై తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందన్నారు. 

1980ల నాటి చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంటే.. తెలంగాణలో ఇప్పుడు విద్యుత్‌ కోతల విషయంలో నాటి పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్లే విద్యుత్‌ సమస్య వచి్చందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘ఇది ఎల్‌నినో వల్ల కాదు.. ఎల్‌ కాంగోతోనే’అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి రైతులే విద్యుత్‌ సమస్యపై రోడ్డెక్కి ధర్నా చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు.  

బొగ్గు కొరత.. కేంద్రాల్లో ఉత్పత్తికి బ్రేక్‌ 
జెన్‌కోకు నాణ్యత లేని బొగ్గు సరఫరా చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ఐదు విద్యుత్‌ కేంద్రాల్లో వారం రోజులుగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని, సింగరేణిలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు కొరత ఉందని చెప్పారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 400 మెగావాట్లే ఉత్పత్తి అవుతోందని, 270 మెగావాట్ల భద్రాద్రి కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. నాణ్యత లేని బొగ్గు కారణంగా రూ.2,900 కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. తెలంగాణ జెన్‌కో సింగరేణికి రూ.52 వేల కోట్లు బకాయి పడిందన్నారు. బొగ్గు లేక వైటీపీఎస్‌లో డీజిల్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారని, ఆ కేంద్రాన్ని ప్రైవేటీకరించాలనుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.  

ఆరు బృందాలతో బీఆర్‌ఎస్‌ పరిశీలన 
రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి పరిస్థితులపై వాస్తవాలను తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఆరు బృందాలను ఏర్పాటు చేసిందని కేటీఆర్‌ తెలిపారు. యాదాద్రి, కేటీపీఎస్, భద్రాద్రి, భూపాలపల్లి కేటీపీపీ, జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్, సింగరేణి ప్రధాన కార్యాలయాలను ఈ బృందాలు పరిశీలిస్తాయని చెప్పారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం, మరో 23 మంది గాయపడటంపై కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జూరాల ఆయకట్టు రైతుల పంటలు ఎండుతున్నా నీటిని విడుదల చేయకుండా రైతులు, బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు.  

మండలి ఎన్నికలపై దృష్టి 
రాబోయే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు. మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని, యువత, ఉద్యోగులు, పట్టభద్రుల్లో ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని ఆదేశించారు. 

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు జోక్యం 
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న అంశంపై కేటీఆర్‌ స్పందిస్తూ... ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఐఆర్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.   

ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకున్న కేటీఆర్‌ 
ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): ఖైరతాబాద్‌ మహాగణపతిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ అంతటా, దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని తద్వారా రైతులు బాగుండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కులమతాలకు అతీతంగా అందరూ పండుగల వేళ కలిసి మెలిసి ఉండాలని, శాంతిభద్రతలు బాగుండాలని పేర్కొన్నారు. కేటీఆర్‌తో పాటు తలసాని శ్రీనివాస్‌యాదవ్, గజ్జల నాగేశ్‌ తదితరులు ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement