రాష్ట్ర విద్యుత్ రంగం నుంచి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు
రెండు నెలల్లో రూ.25,221 కోట్ల పెట్టుబడులు వెనక్కు
తాజాగా రూ.10,300 కోట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును రద్దు చేసుకున్న మెఘా ఇంజనీరింగ్
ఇప్పటికే బైబై చెప్పేసిన టాటా పవర్, వెబ్‌సోల్, ఆర్‌వీఆర్ తదితర కంపెనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో పవర్ కోటరీ దెబ్బకు విద్యుత్ కంపెనీలు పారిపోతున్నాయి. రెండు నెలల కాలంలోనే విద్యుత్ రంగం నుంచి నాలుగు ప్రధాన కంపెనీలు రూ.25,221 కోట్ల విలువైన భారీ పెట్టుబడులను ఉపసంహరించుకుని వెళ్లిపోయాయంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి టాటా పవర్ ఒడిశాకు, తిరుపతి జిల్లా నుంచి వెబ్‌సోల్ సంస్థ పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా నంద్యాల జిల్లా అవుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆర్‌వీఆర్ ప్రాజెక్టు దండం పెట్టి మరీ తప్పుకుంది. ఇదే సమయంలో మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ అన్నమయ్య జిల్లా కొమ్మూరు వద్ద ప్రతిపాదిత 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో 2024 నవంబర్ 18న కొమ్మూరు వద్ద సుమారు రూ.10,300 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 2025 జనవరి 30న మూడవ ఎస్‌ఐపీబీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడమే కాకుండా అనేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ 2025 ఫిబ్రవరి 7న జీవో ఎంఎస్ నెంబర్ 16 జారీ చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం, జీవో విడుదలైన 20 నెలల తర్వాత కూడా పనులు ప్రారంభించలేకపోయింది. ఇదే మెఘా ఇంజనీరింగ్ కంపెనీయే ఇప్పుడు రూ.10,300 కోట్ల విలువైన కీలక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నుంచి వైదొలగడంపై అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
అన్ని రకాల అధ్యయనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్టుకు దాఖలు చేసుకున్న మెఘా ఇంజనీరింగ్.. ఇప్పుడు పర్యావరణ అనుమతులు లభించడం కష్టం అంటూ ప్రాజెక్టు నుంచి వైదొలగడం వెనుక పవర్ సెంటర్ కప్పం సెగ గట్టిగా తగిలిందని సమాచారం. ఇలా ఒకదాని వెనుక మరో కంపెనీ విద్యుత్ రంగం నుంచి వైదొలుగుతుండటం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో టాటా పవర్‌కు కారు చౌకగా భూమిని ఇవ్వడంతో పాటు, భారీగా రాయితీలు ఇచ్చినా కూడా వెళ్లిపోయిందని, ఇదే బాటలో వెబ్‌సోల్ కూడా వెళ్లి పోవడం వెనుక సర్కారు కోటరీలోని ప్రధాన పవర్ సెంటర్ కప్పం దెబ్బే కారణమని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రం నుంచి రూ.31,256 కోట్ల పెట్టుబడులు ఔట్
ఎస్‌ఐపీబీ, రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత.. జీవోలు వచ్చాక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయి. కేవలం విద్యుత్ రంగం నుంచే రెండు నెలల్లో నాలుగు కంపెనీల ద్వారా రూ.రూ.25,221 కోట్ల విలువైన పెట్టుబడులు వెళ్లిపోయాయి. ఇవి కాకుండా ఇతర రంగాల నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు అజాద్ మొబిలిటీ, జిన్‌ఫ్రా, ఐస్పేస్ వంటి వాటిని తీసుకుంటే ఈ విలువ ఇప్పుడు రూ.31,256 కోట్లు దాటింది. వచ్చే నవంబర్‌లో సీఐఐఐ పెట్టుబడుల సమావేశం ముందు ఇలా వరుసపెట్టి కంపెనీలు వెళ్లిపోతుండటం పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపుతోంది.


