అనుమానంతో గొంతుకోసి..! | Lorry driver assassinated his wife and mother in law | Sakshi
Sakshi News home page

అనుమానంతో గొంతుకోసి..!

Sep 27 2026 5:23 AM | Updated on Sep 27 2026 5:23 AM

Lorry driver assassinated his wife and mother in law

భార్య, అత్తను కడతేర్చిన లారీడ్రైవర్‌

అద్దంకి: భార్యపై అనుమానం పెనుభూతమైంది. రెండు హత్యలకు దారి తీసింది. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఏల్చూరుకు చెందిన మీసరగండి వసంతరాయుడుకు మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన వీరనారాయణమ్మ(30)కు పదమూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వసంతరాయుడు లారీ డ్రైవర్‌. వీరికి పదకొండేళ్ల అబ్బాయి, ఎనిమిది నెలల పాప ఉంది. రెండేళ్ల క్రితం ఒక వికలాంగ కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. వసంతరాయుడు తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తరచూ అనుమానపడుతూ గొడవలు పడుతూ ఉండేవాడు. 

ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో భార్యపై  ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని అత్త చిలకపాటి వీర బ్రహ్మేశ్వరి(50)తోపాటు మామను పిలిపించి మాట్లాడారు. ‘మీ అల్లుడు కోపంగా ఉన్నాడు.. కుమార్తెను మీ ఊరికి తీసుకెళ్లండి’ అని సూచించారు. అయితే వారు ఊరికి వెళ్లకుండా వసంతరాయుడు ఇంటికి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మరో వ్యక్తితో కలిసి వచ్చిన వసంతరాయుడు ఆవేశంతో కత్తితో భార్య వీరనారాయణమ్మ గొంతు కోశాడు. అడ్డొచ్చిన అత్త బ్రహ్మేశ్వరిపైనా కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. దీంతో బ్రహ్మేశ్వరి అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సంతమాగులూరు సీఐ శేషగిరిరావు కొన ఊపిరితో ఉన్న వీరనారాయణమ్మను చికిత్స నిమిత్తం వాహనంలో వైద్యశాలకు తరలించారు.

ఆమె అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పరారైన వసంతరాయుడిని  పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరో నిందితుని పాత్రపైనా విచారణ చేపట్టారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ శేషగిరిరావు ఇచ్చిన సమాచారం మేరకు దర్శి డీఎస్పీ బాల­మురళీకృష్ణ, బల్లికురవ ఎస్సై నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నిందితుని మామ వీరనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఏఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement