నాటి సీఎం వైఎస్ జగన్ హయాంలో 6100 పోస్టులకు నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకున్నకానిస్టేబుళ్లకు గత ఏడాది డిసెంబరు 22న పీటీసీలో శిక్షణ ప్రారంభం నేడు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పాస్‌అవుట్‌లో పాల్గొన్న 190 మంది తరలివచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
ఒంగోలు టౌన్: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల శిక్షణ నేటితో పూర్తయింది. 2022 నవంబరులో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సుమారు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎంపికై న అభ్యర్థులు 198 మందికి శిక్షణ నిమిత్తం ఒంగోలు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు కేటాయించారు. వారిలో 193 మంది రిపోర్టు చేశారు. అయితే మధ్యలో మరో ముగ్గురు వివిధ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో శిక్షణ నుంచి వెళ్లిపోయారు. చివరికి 190 మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2025 కానిస్టేబుల్ బ్యాచ్‌లో 34 మంది అభ్యర్థులు బీటెక్ చదివిన వారుండడం గమనార్హం. డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు 121 మంది ఉండగా పీజీ చేసిన వారు 16 మంది అభ్యర్థులున్నారు. వీరంతా తొమ్మిది నెలలుగా శిక్షణ తీసుకున్నారు. శనివారం శిక్షణ పూర్తి చేసుకొని బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండులో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి కొత్త కానిస్టేబుళ్ల తలిదండ్రులు, బంధు మిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పండుగ వాతావరణం కనిపించింది. పరేడ్ అయిపోయిన తరువాత ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించబోతున్న కానిస్టేబుళ్లు తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. పరేడ్ కమాండర్‌గా మహమ్మద్ రజా వ్యవహరించారు. వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులకు కొత్త కానిస్టేబుళ్లు గౌరవ వందనం సమర్పించడం ఆకట్టుకుంది. పోలీసు కానిస్టేబుళ్లుగా సమర్ధవంతంగా విధులు నిర్వహించడం ద్వారా మంచి గుర్తింపు పొందాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.విజయకుమార్, దామచర్ల జనార్దన్, ఏఎస్పీలు యుగంధర్ బాబు, ఏఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు గురునాథ్, రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, డీటీసీ సీఐ పాండురంగారావు, డీటీసీ ఆర్‌ఐ రవికుమార్, ఆర్‌ఐ (అడ్మిన్) రమణారెడ్డి, ఆర్‌ఐ వెల్ఫేర్ సీతారామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టెక్నాలజీతో పోటీ పడాలి:
ఈ సందర్భంగా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ పోలీసు శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారని, కొత్త కానిస్టేబుళ్లు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటే సులువుగా కేసులను ఛేదించవచ్చని సూచించారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ టెక్నాలజీతో పోటీ పడాలని చెప్పారు.
పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలి:
ఎస్పీ హర్షవర్థన్ రాజు
కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న కొలువులో చేరబోతున్న కానిస్టేబుళ్లు అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించడం ద్వారా పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు సూచించారు. డీటీసీలో శిక్షణ పొందిన అభ్యర్థులు తొమ్మిది నెలల కాలంలో చట్టాలు, క్రిమినల్ లాస్, లా అండ్ ఆర్డర్, ఆయుధాల వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ క్రైం, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.


