కలగానే కంభం చెరువు అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కలగానే కంభం చెరువు అభివృద్ధి

Sep 27 2026 3:58 AM | Updated on Sep 27 2026 3:58 AM

కలగానే కంభం చెరువు అభివృద్ధి

కంభం చెరువు అక్కడికి వెళ్లగానే ఏదో అనుభూతి కలుగుతుంది. రెండు కొండల నడుమ నిర్మించిన ఆనకట్ట, కనుచూపు మేరల్లో సముద్రాన్ని తలపించేలా నీళ్లు.. నీటి మధ్యలో కొండలు, పక్షుల కేరింతలు, సాయం సంధ్య వేళ సూర్యకిరణాలు ప్రతిబింబించే సుందర దృశ్యాలు, చెరువుకట్టను ఆనుకొని పచ్చని పంటపొలాలు, వాటి మధ్యలో నుంచి వెళ్తున్న రైలుమార్గం సందర్శకులను ఆకట్టుకుంటుంటాయి. కంభం చెరువు నమూనా చిత్రం సైతం లండన్‌ మ్యూజియంలో ఉండటం విశేషం. ప్రపంచ వారసత్వ సంపదకు నిర్వహించిన పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 14 కట్టడాలు ఎంపిక కాగా అందులో నాలుగు మనదేశానికి చెందినవి ఉన్నాయి. వాటిలో రాష్ట్రంలో మూడు కట్టడాలు చోటు దక్కించుకోగా అందులో కంభం చెరువు ఒకటి. 2020వ సంవత్సరంలో ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో అత్యంత పురాతనమైన కట్టడంగా కంభం చెరువు నిలిచింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద చెరువుగా, ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువుగా నిలిచిన చారిత్రాత్మక కంభం చెరువు కట్టపై కనీస వసతులు లేవు. గతంలో జపాన్‌ నిధులు రూ.11.97 కోట్లు వెచ్చించినా చెరువు అభివృద్ధికి నోచుకోలేదు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పర్యాటక కేంద్రంగా మారేందుకు అవకాశం ఉన్న కంభం చెరువును ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా మారిస్తే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డితో కలసి జిల్లా టూరిజం శాఖాధికారిణి అద్దంకి రమ్య కంభం చెరువును సందర్శించారు. ఈ నేపథ్యంలో చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, వచ్చే నాలుగైదు నెలల్లో పనులు మొదలు పెడతామని చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబరు నెలలో ఏపీ టూరిజం శాఖ చైర్మన్‌ నూకసాని బాలాజి కంభం చెరువును సందర్శించి తొలి విడతలో రూ.5 కోట్లతో కంభం చెరువును పర్యాటకంగా మార్చేందుకు పనులు మొదలు పెడతామని చెప్పారు. మాటలు చెప్పి వెళ్లిన నేతలు, అధికారులు ఆపై పట్టించుకోలేదు.

కంభం చెరువు కట్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement