పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చన | - | Sakshi
Sakshi News home page

పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చన

Sep 27 2026 3:58 AM | Updated on Sep 27 2026 3:58 AM

● మంత్రి స్వామిపై మాజీ మంత్రి సురేష్‌ ఫైర్‌

సింగరాయకొండ: దళిత ప్రజానాయకుడు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మరణం చెందితే ఒక దళిత మంత్రిగా, జిల్లా వాసిగా ఉన్న మంత్రి డోలబాల వీరాంజనేయస్వామి వాస్తవాలు సరిగా తెలియకుండా ఆ వ్యక్తి మరణం మీద రాజకీయంగా విషం చిమ్మటం సిగ్గుచేటని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఘాటుగా స్పందించారు. శనివారం సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ మంత్రి స్వామి పోలీసులను వెనకేసుకొస్తూ మాట్లాడటం దారుణమన్నారు. శాప్‌ కార్యాలయం ముట్టడిలో చాలా స్పష్టంగా వీడియో ఆధారాలు ఉన్నాయని, పోలీసుల దాడిలో రాజశేఖర్‌ మూడుసార్లు కిందపడిన దృశ్యాలు కనబడుతున్నాయన్నారు. జిల్లాలో దళితుల సమస్యల మీద అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి ఆకస్మిక మరణాన్ని కూడా రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలుగు తమ్ముళ్లు గుండాల రూపంలో పోలీసుల వద్ద లాఠీలు తీసుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడిచేసిన తీరు మంత్రి స్వామికి కనబడలేదా అని ప్రశ్నించారు. దళితుల మీద, దళిత జాతిమీద ఆయనకు కనీసం సానుభూతి కానీ, కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం కాని ఏమాత్రం లేకపోవటం బాధాకరమన్నారు. రాజశేఖర్‌ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. గతంలో టీడీపీ దళితుల మరణాన్ని రాజకీయంగా వాడుకున్న నేపథ్యంలో పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్న చందంగా స్వామి వ్యవహరిస్తున్నారన్నారు. కాకుమాను కుటుంబ సభ్యులు మూడు రోజులుగా ఏవిధంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యారో, అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఏవిధంగా రాజశేఖర్‌ వెంటబడి వేధించారో, ఆస్పత్రిలో అడ్మిట్‌ అయి రెండు సైలెన్‌ బాటిల్స్‌ ఎక్కించుకున్న విషయం కళ్లెదుట కనబడుతున్నా మంత్రి స్వామి మాత్రం పోలీసులను, ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ వ్యంగ్యంగా రాజశేఖర్‌ మరణంపై మాట్లాడటం దారుణమన్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే దళిత హోం మంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులతో ఆనాటి సంఘటన మీద ప్రకటన ఇప్పించాలని సురేష్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement