● ప్రకాశం, మార్కాపురం ఎస్పీలు హర్షవర్థన్ రాజు, పంకజ్‌కుమార్ మీనా
ఒంగోలు టౌన్/మార్కాపురం టౌన్: స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగులు ఆదివారం నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమానికి ఎటువంటి అనుమతిలేదని ప్రకాశం, మార్కాపురం జిల్లా ఎస్పీలు హర్షవర్థన్ రాజు, పంకజ్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. చలో విజయవాడకు అనుమతులు లేనందున స్వర్ణ గ్రామ ఉద్యోగులు విజయవాడకు వెళ్లే కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు. స్వర్ణ గ్రామ ఉద్యోగులు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
● ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి
ఒంగోలు సిటీ:
వ్యక్తుల సంక్షేమమే సమాజ సంక్షేమమని ఏకేయూ వైస్ ఛాన్సలర్ డీవీఆర్ మూర్తి అన్నారు. ఒంగోలులోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) స్థాపన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ డీవీఆర్ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సేవ అనే పదానికి నిజమైన అర్థాన్ని తెలుసుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. మనం ఇతరులకు సేవ చేస్తే సమాజం మనకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాయకత్వం అనేది బాధ్యతతో కూడుకున్నదని, దానికి తగిన విధంగా మెలగాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా.ఎన్.హర్షప్రీతమ్ దేవ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ఆవిర్భావం, లక్ష్యాలు, వాలంటీర్లలో నాయకత్వ లక్షణాల పెంపుపై వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జి.సోమశేఖర్, ప్రొఫెసర్ కేవీఎన్.రాజు, ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.సంతోష్, అధ్యాపకురాలు ఎం.ప్రభావతి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ప్రోగ్రాం ఆఫీసర్ డా.పి.శ్రీనివాసులు, తెలుగు శాఖాధిపతి డా.నూనె అంకమ్మరావు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్:
రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను దేశంలోనే అత్యంత కీలకమైన గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా (ప్రపంచ ఉద్యాన కేంద్రం) అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్ట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక రీల్, వీడియో కాంటెస్ట్‌ను ప్రారంభించిందని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ పోటీ ద్వారా రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి మౌలిక వసతుల కల్పన, తోటబడుల విస్తరణ, రైతుల సాధికారతను ప్రతిబింబించేలా క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, విద్యార్థులు, డిజిటల్ క్రియేటర్లు తమ సృజనాత్మక వీడియోలతో డిజిటల్ మాధ్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ, 60 నుంచి 90 సెకన్ల నిడివి కలిగిన వీడియోలను సెప్టెంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. అందిన వీడియోల నుంచి అత్యుత్తమ 5 వీడియోలను సెప్టెంబర్ 30 సాయంత్రానికి ఎంపిక చేసి, అక్టోబర్ 1వ తేదీన విజేతల పేర్లను ప్రకటిస్తారు. ఎంపికై న టాప్–5 వీడియోల క్రియేటర్లను సుమారు 50,000 మంది పాల్గొనే వైభవంగా జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, దేశ ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా ఘనంగా సన్మానిస్తారని, వారి వీడియోలను కార్యక్రమ వేదికపై ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు.


