అసలు ఎందుకీ దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మె? | Bank Strike News Today: What the Bank Unions Demanding, bank holidays | Sakshi
Sakshi News home page

అసలు ఎందుకీ దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మె?

Sep 26 2026 2:29 PM | Updated on Sep 26 2026 2:42 PM

Bank Strike News Today: What the Bank Unions Demanding, bank holidays

దేశంలో బ్యాంకింగ్ సేవలు మరోసారి తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఏడు ప్రధాన ప్రతినిధి సంఘాలు, సుమారు ఎనిమిది లక్షల మంది బ్యాంకింగ్ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్’ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు (మూడు రోజుల పాటు) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. కార్మిక శాఖ డెప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిపిన సమన్వయ చర్చలు విఫలం కావడమే ఈ నిర్ణయానికి తక్షణ కారణం.

ప్రధాన డిమాండ్లు.. ఉద్యోగుల వాదన

  • యుఎఫ్‍బీయూ ప్రధాన డిమాండ్.. వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని తక్షణమే అమలు చేయడం. ప్రస్తుతం రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటున్నాయి. అన్ని శనివారాలనూ సెలవు దినాలుగా ప్రకటించాలని యూనియన్లు పట్టుబడుతున్నాయి.

  • శనివారం సెలవు ఇస్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ అదనంగా 40 నిమిషాల సమయం పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉద్యోగుల పక్షం స్పష్టం చేసింది.

  • ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ, సెంట్రల్ గవర్నమెంట్, ఐటీ రంగాల్లో ఇప్పటికే ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయని యూనియన్‌ చెబుతోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, సిబ్బంది కొరత, పనిభారం అనుభవిస్తున్న బ్యాంకు సిబ్బంది ఆరోగ్యం, కుటుంబ సమతుల్యత(వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌) దృష్ట్యా ఇది అత్యంత అవసరమని  తెలియజేస్తోంది.

  • విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ అప్‌డేషన్‌, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌) స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) విధానంలో మార్పులు వంటివి యూనియన్ల ఇతర ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.

ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యాల వైఖరి

ఐదు రోజుల విధానాన్ని అమలు చేస్తే దేశ ఆర్థిక లావాదేవీలపై ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, చిన్న వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రం భావిస్తోంది. 2024 మార్చి వేతన ఒప్పంద సమయంలో.. ఐదు రోజుల బ్యాంకింగ్‌ సూత్రప్రాయంగా పరిశీలనలో ఉందని సంతకాలు జరిగాయి తప్ప, దీనిపై ప్రభుత్వం నుంచి తుది ఆమోదం లభించలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్ 30 అర్ధవార్షిక క్లోజింగ్ రోజు కావడంతో సమ్మె వల్ల వ్యాపార, పన్ను ఖాతాల సర్దుబాట్లు నిలిచిపోతాయని, అందుకే సమ్మెను విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు వీలుగా సెప్టెంబర్ 27 ఆదివారం నాడు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఆర్‌ఆర్‌బీలను తెరిచి ఉంచాలని ఆర్‌బీఐ సమ్మతి తెలిపింది.

యథావిధిగా యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు

యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తున్నప్పటికీ బ్రాంచ్ బ్యాంకింగ్, చెక్కుల క్లియరెన్స్, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. సెప్టెంబర్ 30 నాటికి  యూనియన్లు సమస్య పరిష్కారం లభించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. సమస్య తీవ్రతరం కాకముందే ప్రభుత్వం, బ్యాంకింగ్ యూనియన్లు స్పందించి వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతున్నాయి.

ఇదీ చదవండి: ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement