జెన్‌జీ జేబులో మన్మోహన్‌.. ఆ అడుగులే ఇప్పుడు! | How Manmohan Singh Economic Reforms Shaped Gen Zs India | Sakshi
Sakshi News home page

జెన్‌జీ జేబులో మన్మోహన్‌.. ఆ అడుగులే ఇప్పుడు!

Sep 26 2026 2:03 PM | Updated on Sep 26 2026 2:37 PM

How Manmohan Singh Economic Reforms Shaped Gen Zs India

మన్మోహన్‌ సింగ్‌ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది.. నిశ్శబ్దంగా మాట్లాడే మాజీ ప్రధాని. కానీ నేటి జెన్‌జీకి ఆయన అంతకంటే ఎక్కువ. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఇంటర్నెట్‌ వరకు.. స్టార్టప్‌ల నుంచి విదేశీ కంపెనీల ఉద్యోగాల వరకు.. భారత ఆర్థిక వ్యవస్థలో మూడు దశాబ్దాలుగా కనిపిస్తున్న ఎన్నో మార్పుల వెనుక ఆయన ఆలోచనల ముద్ర కనిపిస్తుంది.

ఒక్కసారి 1991కి వెళ్దాం. అప్పట్లో దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దేశం తన అవసరాలకు కావాల్సిన వస్తువులను కొనుక్కోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు. దిగుమతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రైవేట్‌ రంగంపై ఉన్న అనేక ఆంక్షలను క్రమంగా సడలించారు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో మరింతగా అనుసంధానం చేసే దిశగా అడుగులు వేశారు.

ఆ మార్పులు అంటే అప్పట్లో సామాన్యుడికి వెంటనే అర్థమయ్యే విషయం కాదు. కానీ వాటి ప్రభావం క్రమంగా కనిపించింది. విదేశీ కంపెనీలకు భారత మార్కెట్‌ తెరుచుకుంది. ప్రైవేట్‌ రంగానికి అవకాశాలు పెరిగాయి. పోటీ పెరిగింది. కొత్త పరిశ్రమలు, కొత్త సేవలు వచ్చాయి. తర్వాతి సంవత్సరాల్లో ఐటీ రంగం వేగంగా విస్తరించడానికి కూడా ఈ మారిన ఆర్థిక వాతావరణం ఒక నేపథ్యంగా నిలిచింది.

ఇప్పుడు 2026. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే జీడీపీ వృద్ధి బలంగానే కనిపిస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 2025–26లో భారత ఆర్థిక వృద్ధి 7.6 శాతంగా నమోదైంది. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ పరిస్థితులు, ముఖ్యంగా ఇంధన ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో వృద్ధి 6.6 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. అయితే జెన్‌జీ ప్రశ్న మాత్రం జీడీపీ దగ్గర ఆగిపోదు.

మరి నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు?
ఇదే అసలు ప్రశ్న. ఇటీవలి ఆర్థిక విశ్లేషణల్లోనూ ఇదే అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం భారత వృద్ధికి ఉద్యోగాలు, ఉత్పాదకత, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరం పెద్ద సవాలుగా మారింది. కోట్లాది మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న సమయంలో.. జీడీపీ పెరగడం కంటే వారికి స్థిరమైన, మంచి ఆదాయం ఇచ్చే ఉద్యోగాలు ఎంత వస్తున్నాయన్నదే కీలకం.

ఇక్కడే మన్మోహన్‌ మళ్లీ జెన్‌జీ జేబులోకి
ఎందుకంటే ఆయన కాలంలో మొదలైన ఆర్థిక మార్పులు “ప్రపంచంతో పోటీ పడే భారత్‌” అనే దిశను బలపరిచాయి. నేడు ఒక చిన్న పట్టణంలో ఉన్న యువకుడు విదేశీ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేయగలగడం, ఇంటి నుంచే ఆన్‌లైన్‌ సేవలు అందించడం, యాప్‌ ద్వారా వ్యాపారం మొదలుపెట్టడం, ప్రపంచ మార్కెట్‌ గురించి తెలుసుకోవడం.. ఇవన్నీ ఒక్కరోజులో వచ్చిన మార్పులు కావు. మూడు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పుల ఫలితంగా ఏర్పడిన అవకాశాల గొలుసులో ఇవి భాగం. అయితే కథ ఇక్కడితో పూర్తికాదు. 

అప్పట్లో భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలపడం పెద్ద సవాలు అయితే.. ఇప్పుడు ఆ వృద్ధి ఫలాలను ఎక్కువ మందికి చేరేలా చేయడం మరో పెద్ద సవాలు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు అవకాశాలు, మహిళలకు ఉపాధి, నైపుణ్యాలకు తగ్గ పనులు రావాల్సి ఉంది. ఉద్యోగ కల్పన కోసం ప్రైవేట్‌ రంగ పెట్టుబడులను పెంచే సంస్కరణలపై ప్రపంచ బ్యాంకు కూడా దృష్టి పెట్టింది. 

అప్పట్లో మన్మోహన్‌ సింగ్‌ ముందున్న ప్రశ్న.. “భారత ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడాలి?”

ఇప్పుడు జెన్‌జీ ముందున్న ప్రశ్న.. “ఈ ఆర్థిక వృద్ధిలో నా భవిష్యత్తు ఎక్కడ?”

మన్మోహన్‌ సింగ్‌ జయంతి రోజున ఆయనను గుర్తు చేసుకోవడం అంటే కేవలం ఓ మాజీ ప్రధానికి, గొప్ప ఆర్థికవేత్తగా గుర్తుంచుకుని నివాళి ఇవ్వడం కాదు.. నేటి భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఇక్కడికి వచ్చిందో గుర్తు చేసుకోవడం కూడా.

:::వెబ్‌ డెస్క్‌ ప్రత్యేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement