అంతా కనిపించేలా రీల్స్‌ చేస్తే.. | Tamil Nadu YouTuber Madhumitha Flaunted Gold Online Then This Happened, Couple Robbed Of 118 Sovereigns Worth Nearly ₹1 Crore | Sakshi
Sakshi News home page

అంతా కనిపించేలా రీల్స్‌ చేస్తే..

Sep 26 2026 11:02 AM | Updated on Sep 26 2026 11:35 AM

Tamil Nadu YouTuber Madhumitha Flaunted Gold Online Then This Happened

సోషల్‌ మీడియాలో లైక్స్‌, వ్యూస్‌ కోసం కొందరు హద్దులు దాటుతుంటారు. హోం టూర్‌ అంటూ ఇంటిని మొత్తం చూపించడమే కాకుండా.. అందులో ఉన్న బంగారం, నగదు, ఖరీదైన వస్తువులను సైతం కెమెరాకు ప్రదర్శిస్తుంటారు. తమ ఇంట్లో ఏముంది? ఎంత విలువైన వస్తువులున్నాయి? అనే విషయాలను తెలియకుండానే బహిరంగంగా చెప్పేస్తుంటారు. అలాంటి వారికి ఈ ఘటన ఓ గట్టి హెచ్చరిక తెలియజేస్తోంది.

తమిళనాడులోని ఓ యూట్యూబర్‌ దంపతుల ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. వాటి విలువ దాదాపుగా కోటి రూపాయల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ కోణంలోనూ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తుండడం గమనార్హం.

కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ సమీపంలోని తమ్మట్టుకొణం వీఐపీ గార్డెన్‌లో వ్యాపారి కమ్‌ యూట్యూబర్‌ వినోద్‌కుమార్‌, యూట్యూబర్‌ మధుమిత దంపతులు నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన వారు రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి వెనుక తలుపు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లోని బీరువా కూడా పగలకొట్టి ఉంది. అందులో ఉంచిన బంగారం, వజ్రాభరణాలు, నగదు కనిపించలేదు.

రీల్స్‌లో అంతా కనిపించేలా..
మధుమిత సోషల్‌ మీడియాలో బంగారు ఆభరణాలు, నగదు కట్టలను ప్రదర్శిస్తూ పలు వీడియోలు పోస్ట్‌ చేశారు. పూజా గదిలో, ఇంట్లో నగదు, బంగారం చూపించడం.. చిన్నారిపై నోట్లను చల్లడం వంటి దృశ్యాలు కూడా వీడియోల్లో ఉన్నాయి. అంతేకాదు, కుటుంబం ఎక్కడికి వెళ్తోంది, బంగారం కొనుగోలు చేస్తున్న విషయాలను కూడా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ వచ్చారు.

పోస్టులే క్లూ ఇస్తాయా?
చోరీపై రాజాక్కమంగళం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వెనుక తలుపు కట్టింగ్‌ మెషీన్‌తో తెరిచి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంటి వద్ద, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోన్‌ కాల్‌ రికార్డులు, దొంగల కదలికలపైనా దృష్టి పెట్టారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదండి: వామ్మో.. పది వేల కోట్ల పరిహారమా తల్లి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement