పట్నా: బిహార్‌లో ఇటీవలి ఉప ఎన్నికల్లో కీలక విజయాన్ని అందుకున్న జన్ సురాజ్ పార్టీ ఇప్పుడు ఢిల్లీ వైపు అడుగులు వేస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్.. దేశ రాజధానిలో పార్టీని విస్తరించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఆదివారం ఢిల్లీలో జన్ సురాజ్ మద్దతుదారులతో సమావేశం నిర్వహించనున్న ఆయన.. పార్టీ ఢిల్లీ విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా స్టీరింగ్ కమిటీని ప్రకటించనున్నట్లు సమాచారం.
ఢిల్లీలో పార్టీ నిర్మాణానికి తొలి అడుగు
జన్ సురాజ్ పార్టీని 2024 అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ స్థాపించారు. 2025 నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన పార్టీ 243 స్థానాల్లో 238 చోట్ల అభ్యర్థులను నిలబెట్టినా ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 202 స్థానాలు గెలుచుకోగా.. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్ 35 స్థానాలు సాధించింది.
బంకీపూర్ ఉప ఎన్నికలో విజయంతో..
అయితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. ఆయనకు ఇది ప్రత్యక్ష ఎన్నికల్లో తొలి విజయం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎదగడం, రాజ్యసభకు ఎన్నిక కావడంతో బంకీపూర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ విజయంతో జన్ సురాజ్ పార్టీ బిహార్ వెలుపల కూడా తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
పుర్వాంచలీలపై ప్రత్యేక దృష్టి
ఢిల్లీలో పార్టీ బలాన్ని పెంచుకోవడంలో బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ మూలాలున్న పుర్వాంచలీలను కూడా కీలక వర్గంగా జన్ సురాజ్ చూస్తోంది. ఆదివారం జరిగే సమావేశానికి ఢిల్లీలో నివసిస్తున్న పలువురు జన్ సురాజ్ మద్దతుదారులు హాజరుకానున్నట్లు సమాచారం. ఢిల్లీ జనాభాలో పుర్వాంచలీలు సుమారు 25 శాతం మంది ఓటర్లుగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజధానిలోని ఈ వర్గం ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లోని 15-20 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే వర్గంగా పరిగణించబడుతోంది.
స్టీరింగ్ కమిటీలో పలువురికి చోటు
ఢిల్లీలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేయనున్న స్టీరింగ్ కమిటీలో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ బక్సర్ ఎంపీ కేకే తివారీ కుమారుడు, న్యాయవాది తథాగత్ హర్షవర్ధన్, ఢిల్లీ యూనివర్సిటీలోని దేశ్‌బంధు కాలేజీ ప్రొఫెసర్ శాంతను కుమార్, హిమాచల్‌ప్రదేశ్ మాజీ అదనపు డీజీపీ జేపీ సింగ్ ఈ కమిటీలో ఉండే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. వీరితో పాటు బిహార్ పార్టీ ఇంటెలెక్చువల్ సెల్ అధిపతి, మాజీ ఐఈఎస్ అధికారి కున్వర్ చంద్రేశ్, మైనారిటీ విభాగం చీఫ్ అబూ అఫాన్ ఫరూకీ, ప్రియాంక సింగ్, వ్యాపారవేత్త అజయ్ సింగ్, మాజీ ఓఎన్‌జీసీ డైరెక్టర్ బాది ఉడ్ దోజా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
2027 నుంచి వరుస ఎన్నికలపై కన్ను
ఢిల్లీలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం, కార్యవర్గాన్ని నియమించడం స్టీరింగ్ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఢిల్లీలో ఇప్పటికే పార్టీ కార్యాలయం కోసం రెండు మూడు ప్రాంతాలను పరిశీలించినట్లు, లీజు, అద్దెకు సంబంధించిన లాంఛనాలు పూర్తయ్యాక కార్యాలయాన్ని ఖరారు చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి. 2027లో జరగబోయే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి 2029 లోక్‌సభ ఎన్నికలు, 2030 అసెంబ్లీ ఎన్నికల వరకు ఢిల్లీలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని జన సురాజ్ భావిస్తున్నట్లు పార్టీ నేత శాంతను కుమార్ తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం, యమునా శుద్ధి వంటి సమస్యలకు ఇప్పటికే ఉన్న వ్యవస్థలను మరింత సమర్థంగా ఉపయోగించడంతో పాటు కొత్త పరిష్కారాలను ప్రతిపాదిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: యూఎన్‌లో షరీఫ్ వ్యాఖ్యలు.. భారత్ ఘాటు కౌంటర్


