నోరు విప్పితే నిన్నూ తోసేస్తాం! | Ketan Agarwal Case: Eyewitness Claims He Saw Realtor Pushed Off Lohagad Fort | Sakshi
Sakshi News home page

నోరు విప్పితే నిన్నూ తోసేస్తాం!

Sep 28 2026 9:10 AM | Updated on Sep 28 2026 9:35 AM

Ketan Agarwal Case: Eyewitness Claims He Saw Realtor Pushed Off Lohagad Fort

పుణె యువ రియల్టర్‌ కేతన్‌ అగర్వాల్‌ మృతి కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. లోహగఢ్‌ కోటపై కేతన్‌ను కొండ నుంచి తోసేయడాన్ని తాను కళ్లారా చూశానని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు.. ఈ విషయం బయటకు చెబితే తనకూ అదే గతి పడుతుందని బెదిరించారని చెప్పాడు. స్థానిక మీడియా కథనాల ద్వారా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జూన్‌ 18న కేతన్‌ తన కాబోయే భార్య సియా గోయల్‌తో కలిసి లోహగఢ్‌ కోటకు వెళ్లాడు. ఆ వెనక మరో వ్యక్తి కూడా వారిని అనుసరించాడు. అదే సమయంలో ఆ సాక్షి తన స్నేహితుడి కుటుంబంతో కోటకు వెళ్లాడు. మెట్లపై ఓ జంట ముందుగా వెళ్తుంటే.. వారి వెనుక హూడీ ధరించిన ఓ వ్యక్తి‌ కనిపించాడు. వేసవి కాలంలో హూడీ ఎందుకు వేసుకున్నావని అతడిని నవ్వుతూ ప్రశ్నించా. అలా ఆ వ్యక్తి ముఖం నాకు గుర్తుండిపోయింది..

కోటపైకి చేరుకున్న తర్వాత ఆ హుడీలో ఉన్న వ్యక్తి ఓ ఆలయం వద్ద కాసేపు కూర్చున్నాడు. అనంతరం కేతన్‌, సియాల వెంట వెళ్లాడు. కాసేపు అక్కడి నుంచి దూరంగా వెళ్లి తిరిగి వస్తుండగా.. సియా ఆ హుడీ వేసుకున్న వైపు చూపించడం కనిపించింది. ఆ తర్వాత సియా కింద కూర్చుని కేతన్‌ కాలిపై తన్నింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముసుగలో ఉన్న వ్యక్తి వెనుక నుంచి వచ్చి కేతన్‌ను కొండ అంచు వైపు తోసిశాడు..

నోరు విప్పితే నీకూ అదేగతి!
ఘటన తర్వాత నాకు కాళ్లు చేతులు వణికాయి. ధైర్యం తెచ్చుకుని ఆ హుడీ వేసుకున్న వ్యక్తిని ఆపాను. ఎందుకు అలా చేశావ్‌? అని నిలదీశాను. ఆ వ్యక్తి కోపంతో రగిలిపోయాడు. ఎవరి దగ్గర అయినా ఈ విషయం చెబితే నిన్నూ అలా తోసేసి చంపుతా అని బూతులు తిడుతూ బెదిరించాడు. ఆ టైంలో ఆ విషయాన్ని నా స్నేహితుడికి కూడా చెప్పలేదు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడ్డాను.

అయితే కేతన్‌ కేసుపై మీడియాలో వస్తున్న కథనాలు చూసి షాక్‌ తిన్నా. కళ్లారా చూసింది చెప్పాలని పోలీసులను సంప్రదించా. ఐదు రోజుల తర్వాత అంటే.. జూన్‌ 23న నా వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు అని లోకల్‌ మీడియాతో ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.

హూడీ.. కీలక గుర్తింపు
ఈ కేసులో మరో సాక్షి వాంగ్మూలం కూడా పోలీసుల దృష్టిలోకి వచ్చింది. లోహగఢ్‌ కోట ఎక్కుతున్న సమయంలో హూడీ వేసుకున్న చేతన్‌ను అతడూ గమనించినట్లు తెలుస్తోంది. ఎండాకాలంలో హూడీ ఎందుకు వేసుకున్నావని ప్రశ్నించగా.. చేతన్‌ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సాక్షి తెలిపినట్టు సమాచారం. దీంతో హూడీ.. చేతన్‌ గుర్తింపును నిర్ధారించడంలో కీలకమైన అంశంగా మారింది.

12 టెరాబైట్ల డేటా..
కేవలం ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలపైనే కాకుండా డిజిటల్‌ ఆధారాలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. దర్యాప్తులో దాదాపు 12 టెరాబైట్ల సాంకేతిక డేటాను విశ్లేషించినట్లు సమాచారం. ఆరు మొబైల్‌ ఫోన్లు, తొమ్మిది పెన్‌డ్రైవ్‌లు, బ్యాకప్‌లు, కాల్‌ రికార్డులు, సోషల్‌ మీడియా ఖాతాల నుంచి సమాచారాన్ని పరిశీలించారు. డిలీట్‌ చేసిన చాట్స్‌, ఇతర డేటాను ఫోరెన్సిక్‌ పద్ధతుల్లో తిరిగి పొందినట్లు పోలీసులు చెబుతున్నారు.

కేతన్‌ మృతికి ముందు, తర్వాత డేటా తొలగింపునకు సంబంధించిన కొన్ని సెర్చ్‌లు కూడా దర్యాప్తులోకి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఐఫోన్‌లో డేటా ఎలా తొలగించాలి, చాట్‌ హిస్టరీని ఎలా క్లియర్‌ చేయాలి, డిలీట్‌ చేసిన సమాచారాన్ని తిరిగి పొందకుండా ఎలా చేయాలన్న అంశాలపై సెర్చ్‌లు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

5,053 పేజీల ఛార్జ్‌షీట్‌
కేతన్‌ అగర్వాల్‌ జూన్‌ 18న లోహగఢ్‌ కోటపై నుంచి పడి మృతి చెందినట్లు తొలుత భావించారు. అయితే దర్యాప్తులో ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. సియా గోయల్‌, చేతన్‌ చౌదరి, అతడి స్నేహితుడు రితేశ్‌ హంగేను నిందితులుగా పేర్కొంటూ పుణె రూరల్‌ పోలీసులు 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఇందులో సుమారు 80–85 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు డిజిటల్‌ ఆధారాలు, కాల్‌ రికార్డులు, ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీ తదితర వివరాలను పొందుపరిచారు.

పోలీసుల ప్రకారం.. కేతన్‌ను లోహగఢ్‌కు రప్పించేందుకు నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఉపయోగించారు. అక్కడ సియా ముందుగా కేతన్‌ను తోసిందని, ఆ తర్వాత చేతన్‌ తన్నడంతో అతడు లోయలో పడిపోయాడని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. తాజాగా ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం కూడా వెలుగులోకి రావడంతో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. దీంతో కేతన్‌ మృతి వెనుక అసలు ఏం జరిగిందన్న దానిపై దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.

ఇదీ చదవండి: బోరుబావి నుంచి బయటకు తీసేలోపే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement