బెదిరించి లైంగిక దాడి.. గర్భం దాల్చిన బాలిక
యువకుడిపై కేసు నమోదు
హైదరాబాద్: ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడు. ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు నాలుగు నెలల గర్భవతి. అఘాయిత్యానికి ఒడిగట్టిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీలోని ఓ సెలూన్‌లో పని చేస్తున్న సమయంలో బాలికకు ఫరీద్ (20) అనే యువకుడితో పరిచయమైంది.
కొంత కాలం వీరు ప్రేమలో ఉన్నారు. 2024 డిసెంబర్‌లో విడిపోయారు. 2025 డిసెంబర్ నుంచి ఫరీద్ బాధితురాలికి ఫొటోలు, సందేశాలు పంపించి కలుసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రసూల్‌పురా మెట్రోస్టేషన్ నుంచి క్యాబ్‌లో బాలికను తీసుకువెళ్లి స్నేహితుడి ఇంట్లో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనను ఫోన్‌లో చిత్రీకరించి, విషయం ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు.
గత ఏప్రిల్‌లోనూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ గదిలోకి తీసుకువెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 8న బాలిక అనారోగ్యం బారిన పడటంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్య పరీక్షల్లో ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇదీ చదవండి: మద్యం మత్తులో నేవీ ఉద్యోగి కారుతో హల్‌చల్! ఆపినా ఆగకుండా..


