పెరుగుతున్న తప్పుదోవ పట్టించే కంటెంట్ సమస్యలు
గీత దాటుతున్న ఏఐ ఏజెంట్లు
అవుట్‌పుట్‌లో 55 శాతం తక్కువ నాణ్యత వస్తోందన్న నాస్కామ్
ప్రమాదం అంచున 12 శాతం ఉద్యోగులు.. ఐఎంఎఫ్ అంచనా
రక్షణ వలయాలపై ఏఐ సంస్థల దృష్టి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాల మధ్య కృత్రిమ మేధ (ఏఐ) యుద్ధం సరికొత్త సవాళ్లు విసురుతోంది. ఏఐ వేగంగా విస్తరిస్తున్నకొద్దీ జనరేటివ్ ఏఐ సాధనాలు అందిస్తున్న సమాధానాల్లో తప్పుడు సమాచారాలు కూడా చేరుతుండటం వాటి విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా చాట్ జీపీటీ వంటి మోడళ్లు సమాధానాలను అసలైనవిగా, విశ్వసించదగ్గవిగా చూపుతున్నప్పటికీ అవి పూర్తిగా వాస్తవాలు కాకపోవచ్చని ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఉనికిలో లేని సమాచారాన్ని ఏఐ వ్యవస్థలు సృష్టించడం లేదా వాస్తవాలను తప్పుగా కలపడం వంటి చర్యలు కొత్త సమస్యలకు కారణమవుతున్నాయనే వాదన తెరమీదకొచ్చింది. ఓపెన్ ఏఐకి సంబంధించి 2026లో కెనడా గోప్యతా నియంత్రణ సంస్థలు నిర్వహించిన సంయుక్త విచారణలో చాట్ జీపీటీ సమాధానాల్లో వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వాస్తవపరమైన తప్పిదాలను గుర్తించారు. ఇది ప్రధానంగా చాట్ జీపీటీ ప్రారంభ అభివృద్ధి, శిక్షణ విధానాలపై అనుమానాలు తీసుకొచ్చింది. దీంతో ఓపెన్ ఏఐ రక్షణ చర్యలను మెరుగుపరచినట్లు నియంత్రణ సంస్థలు తెలిపాయి. అయినప్పటికీ వివిధ అంశాల్లో ఏఐ ఇచ్చిన సమాచారాన్ని నేరుగా ఉపయోగించడం ప్రమాదకరమనే భావన ప్రచారంలోకి వచ్చింది. దీనికితోడు వ్యక్తిగత డేటా గోప్యత, డీప్‌ఫేక్‌లు, సైబర్ ముప్పు, విద్యుత్–నీటి వినియోగం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ తరహా ప్రమాదాలన్నీ ఓపెన్ ఏఐకి మాత్రమే ప్రత్యేకమైనవి కావదని ఏఐ మాడ్యూల్ డెవలపర్ సంజీవ్ థామస్ ‘సాక్షి’కి విశ్లేషించారు. చాట్ జీపీటీతోపాటు ఇతర జనరేటివ్ ఏఐ వ్యవస్థలకూ వర్తించే విస్తృత సాంకేతిక, సామాజిక సమస్యలుగా చూడాలన్నారు.
పలు అధ్యయనాలు తేల్చిన అంశాలు ఇవీ..
– పాఠశాల, కళాశాల విద్యార్థులకు చాట్ జీపీటీ అసైన్‌మెంట్లు, వ్యాసాలు, ప్రాజెక్టులు, కోడింగ్‌లో సహాయపడుతోంది. కానీ విద్యార్థి స్వయంగా పరిశోధన చేయకుండా మొత్తం పనిని ఏఐతో చేయించుకుంటే నేర్చుకునే ప్రక్రియ బలహీనపడే ప్రమాదం ఉందని జర్మనీ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. ఒక విద్యార్థి సమాధానాన్ని ఏఐతో తయారు చేయించుకోవచ్చు. కానీ ఆ సమాధానం ఎందుకు సరైందో వివరించగలడా? మూలాలను తనిఖీ చేశాడా? అనేది అసలు ప్రశ్న. ఇదే సమస్య ఉన్నత విద్యలో మరింత తీవ్రమవుతుంది. ఏఐని సహాయక సాధనంగా ఉపయోగించడానికీ, విద్యార్థి స్థానంలో ఏఐ మొత్తం పని చేయడానికీ మధ్య స్పష్టమైన తేడా ఉంది.
– నాస్కామ్ ఈ ఏడాది నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారత టెక్నాలజీ సంస్థల్లో 20–40 శాతం పని వివిధ మార్గాల్లో ఏఐ ద్వారా జరుగుతోంది. 55 శాతానికిపైగా సంస్థలు ఏఐ ఉత్పత్తుల్లో అసంపూర్తి, లేదా నాణ్యత లేని క్వాలిటీ అవుట్‌పుట్ సమస్య ఉన్నట్లు గుర్తించింది. సుమారు 40 శాతం సంస్థలు ఏఐ యుగానికి అవసరమైన నైపుణ్యాల్లో ఉద్యోగుల సన్నద్ధత లోపాన్ని పేర్కొన్నాయి. జూనియర్, మిడ్–లెవల్ ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉందని కూడా అధ్యయనం పేర్కొంది. అంటే ఈ కేటగిరీ ఉద్యోగులపై రాబోయే రోజుల్లో వేటుపడే పరిస్థితి ఉందని నాస్కామ్ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
– ఐఎంఎఫ్ చేసిన విశ్లేషణ ప్రకారం... భారత కార్మికుల్లో సుమారు 26 శాతం మంది ఏఐ ద్వారా ప్రభావితమై ఉద్యోగాలు పోగొట్టుకునే వృత్తుల్లో ఉన్నారు. అందులో 14 శాతం ఉద్యోగాల్లో ఏఐ మానవ పనికి తోడ్పడే అవకాశం ఉండగా సుమారు 12 శాతం ఉద్యోగాలు ఏఐ కారణంగా ఇతర వృత్తుల్లోకి మార్చే వీలుందని తేల్చి చెప్పింది. అంటే సమస్య కేవలం ఉద్యోగాలు పోవడమే కాదు. ప్రస్తుత ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు మారడం కూడా పెద్ద సవాలుగా ఉండే వీలుందని తెలిపింది.
– నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ గుర్తించిన మరో అంశం ఏఐపై ప్రభావం చూపే అవకాశం కన్పిస్తోంది. ప్రజలు తమ వ్యక్తిగత వివరాలు, కార్యాలయ పత్రాలు, వ్యాపార సమాచారం, కోడ్, కుటుంబ విషయాలు వంటి వాటిని టైప్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఏఐ ఆధారిత విశ్లేషణ వల్ల వ్యక్తుల ప్రవర్తనపై మరింత విస్తృతంగా సమాచారం సేకరించడం, పర్యవేక్షణ సామర్థ్యం పెరగడం వంటి గోప్యతా సమస్యలు కూడా తలెత్తవచ్చని తెలిపింది.
ఆలోచన శక్తిలో మార్పు
ఏఐ ఏజెంట్ పని విధానంపై నిఘా వేయగల శక్తి ఏఐ ఉద్యోగిలో ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ మార్పు ఏఐ ఉద్యోగులు అలవాటు చేసుకోవాలి. ఏఐ టూట్స్ వాడటం కాదు... వాటి నిర్మాణ విధానంపై కమాండ్ ఉంటేనే ఉద్యోగాల్లో నిలబడే అవకాశం ఉంటుంది. ఇది తాజాగా వస్తున్న మార్పు.
– ఎంఎల్ కృపాకర్, డేటా కేంద్రం సీనియర్ ఉద్యోగి


