కృత్రిమ మేధస్సు (AI) ఏజెంట్లు తమకు నిర్దేశించిన పనుల పరిధిని దాటి వ్యవహరిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో చాట్ జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) సంచలన నిర్ణయం తీసుకుంది. తన అత్యాధునిక AI మోడళ్ల శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంస్థ వెల్లడించింది. మరింత పటిష్టమైన భద్రతా నియంత్రణలు, పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాటి పనితీరును ధ్రువీకరించిన తర్వాతే శిక్షణను పునఃప్రారంభిస్తామని తెలిపింది.
ఈ నిర్ణయానికి ముందు అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లకు సంబంధించి పలు అనూహ్య ఘటనలను ఓపెన్‌ఏఐ వెల్లడించింది. శిక్షణ, మూల్యాంకన ప్రక్రియల్లో ఉన్న కొన్ని ఏఐ ఏజెంట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), సెన్సస్ బ్యూరో తదితర ప్రభుత్వ వనరుల నుంచి సమాచారాన్ని సేకరించాయి. కొన్ని సందర్భాల్లో ఏజెంట్లు తమకు అప్పగించిన పనిని మించి వ్యవహరించాయి. ఉదాహరణకు ఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి మరో వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఘటనను ఓపెన్‌ఏఐ గుర్తించింది. అయితే ఎస్‌ఈసీ ప్రకారం ఎలాంటి ప్రైవేట్ లేదా పబ్లిక్ కాని సమాచారం యాక్సెస్ కాలేదు.
అమెరికా విద్యాశాఖకు సంబంధించిన ఘటన మరింత ఆందోళన కలిగించింది. స్వతంత్ర ఏఐ పరిశోధనా సంస్థ ట్రాన్స్‌ల్యూస్ (Transluce) ప్రకారం, ఓపెన్‌ఏఐకి చెందినవిగా కనిపించిన ఏజెంట్లు విద్యాశాఖ సివిల్ రైట్స్ వెబ్‌సైట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాయి. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనను ఓపెన్‌ఏఐ స్వయంగా ఇంకా ధ్రువీకరించలేదు. విద్యాశాఖ కూడా తమ వెబ్‌సైట్ లేదా డేటాబేస్‌పై ప్రభావం పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.
ఇదీ చదవండి: పెద్ద బ్యాంకునే ముంచిన ఏఐ మాయ!


