న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తిలక్ నగర్‌లో రోడ్డు తనిఖీ కార్యక్రమాన్ని వీడియో తీస్తున్న ఒక వ్యక్తిని ఢిల్లీ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ చెంపదెబ్బ కొట్టడం వివాదమైంది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మంత్రి తీరుపై జనం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న తిలక్ నగర్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే జర్నెయిల్ సింగ్ కొత్తగా వేసిన రోడ్డు ఉపరితలాన్ని పరిశీలించి, దాని నాణ్యతను ప్రశ్నించారు.
సమీపంలోనే నిలబడి ఉన్న ఒక యువకుడు ఈ ఘటనను రికార్డ్ చేస్తుండగా, పర్వేశ్ వర్మ అతడిపై చేయి చేసుకున్నారు. అనుచితంగా ప్రవర్తించిన మంత్రిని అరెస్టు చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. స్థానికులు రోడ్డు నాణ్యతను ప్రశ్నించడంతో మంత్రి సంయమనం కోల్పోయారని ‘ఆప్’ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. తనపై వచి్చన ఆరోపణల పట్ల మంత్రి పర్వేశ్‌వర్మ స్పందించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేస్తున్న వీడియోను సందర్భం లేకుండా ప్రచారంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాగే, రోడ్డు కాంట్రాక్టర్ నుంచి స్థానిక ఆప్ ఎమ్మెల్యే కమిషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని జర్నెయిల్ సింగ్ ఫిర్యాదు చేశారని, తాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆప్ ఎమ్మెల్యేను రావాలని కోరానని వర్మ చెప్పారు. అయితే, జర్నెయిల్ అక్కడికి ఆప్ కార్యకర్తలను పిలిపించారని, వారు తన కుటుంబాన్ని దూషించారని వర్మ చెప్పుకొచ్చారు.


