అనుమానాస్పద స్థితిలో యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. ప్రియుడేనా హంతకుడు? | Gauhati University Student Found Dead at Homestay | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యూనివర్సిటీ విద్యార్థిని మృతి.. ప్రియుడేనా హంతకుడు?

Sep 27 2026 5:28 PM | Updated on Sep 27 2026 5:34 PM

Gauhati University Student Found Dead at Homestay

గౌహతి: అస్సాం రాజధాని గౌహతి గౌహతి యూనివర్సిటీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో, నిబంధనలు పాటించని సంబంధిత హోమ్‌స్టేను పోలీసులు సీజ్ చేశారు.

గౌహతి విశ్వవిద్యాలయానికి చెందిన నిమిష ఠాకురియా (22) అనే విద్యార్థిని ధారపుర్-గారాల్ ప్రాంతంలోని  రుద్రాస్ కిచెన్ హోమ్‌స్టేలో అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన సిబ్బంది ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గౌహతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా గత నెల రోజుల్లో ఆ యువతి, ఆమెతో పాటు ఉన్న 26ఏళ్ల అషీక్‌ అలీ అనే యువకుడు ఆ హోమ్‌స్టేను సుమారు ఐదు సార్లు సందర్శించినట్లు తేలింది. అయితే హోమ్‌స్టే నిర్వాహకులు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్ల నుంచి ఎలాంటి గుర్తింపు పత్రాలు  సేకరించకుండానే వారికి గదులు అద్దెకు ఇచ్చినట్లు తేలడంతో, ఆదివారం ఆ హోమ్‌స్టేను పోలీసులు సీజ్‌ చేశారు.

కుటుంబ సభ్యుల ఆవేదన
మృతురాలి తండ్రి దీప్ ఠాకురియా మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నిమిష తన తల్లికి ఫోన్ చేసి, తాను యూనివర్సిటీ హాస్టల్‌లో స్నేహితులతో కలిసి రాత్రి బస చేస్తానని చెప్పిందని తెలిపారు. అయితే అర్ధరాత్రి దాటాక ఆమె ఫోన్ నుంచి ఒక ఊహించని కాల్ వచ్చిందని, ఆ తర్వాత ఎంత సంప్రదించినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆరా తీసేసరికి కుమార్తె ఆసుపత్రిలో ఉన్నట్లు తెలిసిందని వాపోయారు.

నిందితుడి వాదనపై అనుమానాలు
నిమిష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమెతో ఉన్న అషీక్‌ అలీ పోలీసులకు చెప్పాడు. అయితే ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, సీఐడీ, ఫోరెన్సిక్ బృందాలు హోమ్‌స్టే గదిని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించాయని వెస్ట్ డివిజన్ డీసీపీ బాలిన్ దేయురి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు నిజాలు బయటపడతాయని పోలీసులు వెల్లడించారు. మరోవైపు, విద్యార్థిని మృతి పట్ల యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులకు తగిన శిక్షపడాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement