అదుపు తప్పి ప్రవర్తిస్తున్నాయి
ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: టూల్ ఆధారంగా పనిచేసే తమ అత్యంత శక్తివంత కృత్రిమమేథ(ఏఐ) మోడళ్లకు శిక్షణనివ్వడాన్ని నిలిపేస్తూ కృత్రిమమేధ సంస్థ ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు చెందిన ఒక ఓపెన్ ఏజెంట్ తాజాగా ఇంటర్నెట్ అడ్డంకుల్ని సైతం అనధికారికంగా దాటేసి పబ్లిక్ ఇంటర్నెట్ వ్యవస్థలోకి చొరబడి సమాచారం సేకరించిందని, దీంతో అప్రమత్తమై దాని క్రియాశీలతను స్తంభింపజేసినట్లు ఓపెన్‌ఏఐ ఆదివారం ప్రకటించింది.
ఇంకా పరీక్ష దశలోనే ఉన్న ఈ ఏజెంట్‌ను సెర్చ్ ఆధారిత ట్రైనింగ్ టాస్‌్కను పూర్తిచేస్తుందో తెల్సుకునేందుకు సెప్టెంబర్ 20వ తేదీన పరీక్షించారు. అయితే ఇందులో ఎలాంటి ఇంటర్నెట్ సదుపాయం కల్పించలేదు. సొంత కంప్యూటర్ వ్యవస్థలకే పరిమితం చేశారు. అయినాసరే అది నెట్‌వర్క్ అడ్డంకుల్లోని లోపాన్ని కనిపెట్టి ఏకంగా డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్‌ఎస్) ఫిల్టరింగ్‌ను దాటుకుని ఒక పబ్లిక్ చాట్‌బాట్ సరీ్వస్‌లోకి చొరబడి తనకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలను రాబట్టడం మొదలెట్టింది. ఇలా రెండున్నర గంటల పాటు ఏఐ ఏజెంట్ తనకు కావాల్సిన సమాధానాలు, డేటాను సేకరించింది.
ఈ ఏజెంట్ అదుపుతప్పి ప్రవర్తిస్తున్నట్లు గుర్తించాక వెంటనే మ్యాన్యువల్‌గా దానిని స్తంభింపజేసినట్లు ఓపెన్‌ఏఐ పేర్కొంది. ప్రస్తుతానికి తమ ఏఐ మోడళ్లకు అన్ని రకాల శిక్షణ, ఎవాల్యుయేషన్ ప్రక్రియలను నిలిపేసినట్లు సంస్థ వెల్లడించింది. తమ ఏఐ సిస్టమ్‌లలో నెలకొన్న లోపాలను సరిచేసేవరకు తదుపరి శిక్షణ మొదలుకాబోదని సంస్థ స్పష్టంచేసింది. కొత్త ఏఐ మోడళ్ల అభివృద్ధిని అకస్మాత్తుగా సంస్థ నిలిపేయడం గత మూడు నెలల్లో ఇది రెండోసారి. ఇంటర్నెట్‌లేని టెస్టింగ్ వాతావరణం(శాండ్‌బాక్స్)లోనూ ఏఐ వ్యవస్థలు సొంతంగా వెబ్‌సైట్లు, టూల్స్, కంప్యూటర్ సిస్టమ్స్‌లను ఉపయోగించడంపై ఓపెన్‌ఏఐ సంస్థ సైతం ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం.


