సిరిసిల్ల లెక్కలు తేల్చాలి | BRS Leader KTR open letter to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల లెక్కలు తేల్చాలి

Sep 28 2026 4:32 AM | Updated on Sep 28 2026 4:32 AM

BRS Leader KTR open letter to CM Revanth Reddy

8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి 

2,400 ఎకరాలు స్వా«దీనం చేసుకున్న వివరాలు బయటపెట్టాలి 

నేతన్న, రైతన్న సమస్యలకు సీఎం సమాధానం చెప్పాలి 

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ బహిరంగ లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పలు ప్రశ్నలు సంధించారు. సీఎం హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలకు పరిమితం కాకుండా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా సిరిసిల్లలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు దుర్వినియోగమయ్యాయని, అందులో 2,400 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. 8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది? అందులో 2,400 ఎకరాలు ఏ మండలం, ఏ గ్రామంలో, ఎవరి పేర్లపై ఉన్నాయి? ఎంత భూమిని స్వా«దీనం చేసుకున్నారు? అనే వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. 2014 నుంచి 2023 డిసెంబర్‌ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,272 ఎకరాలు మాత్రమే పంపిణీ జరిగాయని, సిరిసిల్ల నియోజకవర్గంలో 204 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని, నిరూపించలేకపోతే సిరిసిల్ల ప్రజలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని నిలిపివేయడంతో నేతన్నలకు ఉపాధి తగ్గిందని ఆరోపించారు. రైతుబంధు బకాయిలు, ఎకరాకు రూ.15 వేల సాయం, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబీమా పునరుద్ధరణపై తేదీలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  

హామీలు.. అభివృద్ధిపై లెక్కలివ్వాలి..: 
సిరిసిల్లను విద్య, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు గతంలో ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కేటీఆర్‌ కోరారు. ఆసరా పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరు, మహిళలకు నెలకు రూ.2,500 సాయం, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, ముదిరాజ్‌లకు ఇచి్చన హామీ, చేపపిల్లలు–గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీబంధు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల సాయం వంటి హామీల అమలుకు స్పష్టమైన తేదీలు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలో గత ప్రభుత్వ హయాంలో రూ.1,564 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.  

రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి: కేటీఆర్‌ 
కందనూలు: రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దేశిటిక్యాల గ్రామం వద్ద పత్తి, మొక్కజొన్న, మినుముల పంటలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, విద్యుత్‌ లేక పంటలు ఎండిపోతున్నందున ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరులో పంటలు ఎండబెట్టి.. ఆంధ్రకు నీటిని తరలిస్తున్నారని, చంద్రబాబు దగ్గర పిల్లిలా ఉంటూ.. నల్లమలలో పులిలా ఉన్నానని ప్రగల్బాలు పలుకుతున్నాడని విమర్శించారు. కేటీఆర్‌ వెంట మాజీమంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement