విశాఖపట్నం: మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ నేవీ ఉద్యోగి హల్‌చల్ చేసిన ఘటన గాజువాకలో చోటుచేసుకుంది. చిన్న గంట్యాడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో గణేశ్ భోస్లే అనే నేవీ ఉద్యోగి కారులో అటుగా వచ్చాడు. పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించగా.. ఆయన వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లాడు.
ఈ క్రమంలో అదుపు తప్పిన కారు వరుసగా వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఏడు ద్విచక్ర వాహనాలతో పాటు మరో రెండు కార్లను ఢీకొట్టడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు కారును పట్టుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అలాగే, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా డ్రైవర్ గణేశ్‌కు బ్రెత్ అనలైజర్ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన పరీక్షకు సహకరించకపోవడంతో రక్త నమూనా పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గాజువాక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మాటామాటా పెరిగి.. భార్యను రోకలి బండతో కొట్టి...


