ముంబై: మహారాష్ట్రలో అత్యంత హృదయ విదారకమైన ఘటన వెలుగు చూసింది. అహిల్యానగర్‌లోని ఓ కల్చరల్ సెంటర్‌లో జరిగిన అంతర్గత వివాదంలో గర్భిణీ మహిళపై నిందితులు కిరాతకానికి పాల్పడ్డారు. బాధితురాలి కడుపుపై ఎక్కి తొక్కడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను వందల కిలోమీటర్లు తరలించి సజీవ దహనం చేసిన దారుణం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. బీడ్ జిల్లా సమీపంలోని 'సప్తసుర్ కల్చరల్ ఆర్ట్ సెంటర్'లో తలెత్తిన అంతర్గత వివాదం కారణంగా పింకీ హనుమంత్ కట్కా (31) అనే గర్భిణీ మహిళపై ఐదుగురు నిందితులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె కడుపుపై ఎక్కి తొక్కడంతో తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయింది. మహిళ స్పృహ కోల్పోవడంతో ఆమె మృతి చెందిందని నిందితులు భావించారు. అయితే, ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఆమె శరీరాన్ని పారవేసేందుకు కుట్ర పన్నారు.
మహిళ అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ కనికరం చూపని నిందితులు, ఆమెను అక్కడి నుంచి దాదాపు 275 కిలోమీటర్ల దూరానికి రహస్యంగా తరలించారు. ధూలే-సోలాపూర్ హైవేపై ఉన్న గరటాడ్ బారి ప్రాంతం సమీపంలోని నిర్జనమైన ఘాట్ ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హతమార్చారు.
ధూలే-సోలాపూర్ హైవే సమీపంలో కాలిన గర్భిణీ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సుమారు 11 గంటల పాటు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సాంకేతిక విశ్లేషణ ద్వారా అనుమానిత వాహనాన్ని అహిల్యానగర్ జిల్లాలోని జామ్‌ఖేడ్ ప్రాంతంలో ఉన్న సప్తసుర్ కల్చరల్ ఆర్ట్ సెంటర్ వద్ద గుర్తించారు.
మృతురాలి గుర్తింపును నిర్ధారించేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేని ఈ క్లిష్టమైన కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కేవలం మూడు రోజుల్లోనే ఈ కేసును విజయవంతంగా ఛేదించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం కాగా, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


