కేవలం రూ.20 చెల్లిస్తే.. రూ.2 లక్షలు అకౌంట్లోకి! | PM Suraksha Bima Yojana Rs 2 Lakh Cover For Just Rs 20, Know The Eligibility Details And Benefits, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

PM Suraksha Bima Yojana: కేవలం రూ.20 చెల్లిస్తే.. రూ.2 లక్షలు అకౌంట్లోకి!

Sep 28 2026 4:09 PM | Updated on Sep 28 2026 4:30 PM

PM Suraksha Bima Yojana Rs 2 lakh cover for just Rs 20 Know The Eligible Details

సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు సేవింగ్స్, బీమా పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ప్రమాదవశాత్తూ చనిపోయినా లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకంలో చేరేందుకు సాధారణంగా ఎలాంటి మెడికల్ టెస్టులు అవసరం ఉండదు.

ఈ స్కీములో చేరినవారు ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లిస్తే.. ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుంది. ప్రమాదవశాత్తూ మరణం సంభవించినప్పుడు నామినీ లేదా అర్హత ఉన్న కుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందుతుంది. అయితే.. క్లెయిమ్ పొందేందుకు పథకంలోని నిబంధనలు, అర్హతలను తప్పనిసరిగా పాటించాలి.

అర్హతలు
18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. దీనికోసం బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నా, ఒక ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరవచ్చు.

జాయింట్ అకౌంట్ ఉన్న సందర్భంలో.. అర్హత ఉన్న ప్రతి ఖాతాదారు విడిగా ప్రీమియం చెల్లించి పథకంలో చేరవచ్చు. ప్రీమియం సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతుంది. బీమా కవరేజ్ కాలం జూన్ 1 నుంచి మరుసటి సంవత్సరం మే 31 వరకు ఉంటుంది. కవరేజ్ కొనసాగాలంటే నిర్ణయించిన ప్రీమియం చెల్లించాలి.

ఏ ప్రమాదాలకు బీమా వర్తిస్తుందంటే?
రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు వంటి ప్రమాదాల వల్ల మరణం లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు.. పథకం నిబంధనల ప్రకారం బీమా ప్రయోజనం లభిస్తుంది. ప్రమాదం కారణంగా మరణించిన సందర్భంలో అర్హత ఉన్న నామినీకి రూ.2 లక్షల వరకు బీమా మొత్తం అందుతుంది. అంగవైకల్యం విషయంలో కూడా నిబంధనల ప్రకారం బీమా ప్రయోజనం లభిస్తుంది.

ఆత్మహత్యకు ఈ పథకం వర్తించదు. రోడ్డు, రైలు లేదా నీటిలో మునిగిపోవడం వంటి ప్రమాదాల విషయంలో అవసరమైన ఆధారాలు, పోలీస్ రికార్డులు వంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. పాము కాటు, చెట్టుపై నుంచి పడటం వంటి ప్రమాదాల్లో కూడా సంబంధిత వైద్య లేదా ఇతర ఆధారాల ఆధారంగా క్లెయిమ్‌ను పరిశీలిస్తారు.

తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ పథకంలో చేరడం సులభమే.. అయినప్పటికీ బీమా కవరేజ్‌కు సంబంధించిన అన్ని నిబంధనలు ముందుగానే తెలుసుకోవడం మంచిది. ముఖ్యంగా.. ఏ ప్రమాదాలకు బీమా వర్తిస్తుంది, క్లెయిమ్ సమయంలో ఎలాంటి పత్రాలు అవసరం, ప్రీమియం ఎప్పుడు కట్ అవుతుంది వంటి విషయాలను బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా తెలుసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement