కొత్త రూల్స్.. 50 శాతం మంది మాత్రమే ఆఫీసుకు! | Parking Charges To Double WFH For Offices In Delhi Winter Pollution Plan | Sakshi
Sakshi News home page

Delhi Winter Pollution Plan: కొత్త రూల్స్.. 50 శాతం మంది మాత్రమే ఆఫీసుకు!

Sep 28 2026 3:12 PM | Updated on Sep 28 2026 3:46 PM

Parking Charges To Double WFH For Offices In Delhi Winter Pollution Plan

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలం వచ్చిందంటే.. వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారుతుంది. చలికాలంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ఈసారి శీతాకాలం ప్రారంభం కాకముందే కొన్ని చర్యలను ప్రకటించింది.

పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు
2026 నవంబర్ 1 నుంచి పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ప్రజలు అవసరం లేని సమయంలో వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అంతే కాకుండా.. నవంబర్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు ఆఫీసుల పనివేళల్లో కూడా మార్పులు చేయనున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తాయి.

50 శాతం మంది ఆఫీసుకు
మరో ముఖ్యమైన నిర్ణయం.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లేలా చేయడం. మిగిలిన 50 శాతం మంది ఇంటి నుంచే పని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల రాకపోకలు, వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

దుమ్ము ఎక్కువగా వచ్చే నిర్మాణ, కూల్చివేత పనులను కూడా కొంతకాలం పూర్తిగా నిలిపివేయనున్నారు. ఢిల్లీలో కాలుష్యానికి వాహనాల పొగ మాత్రమే కారణం కాదు. రోడ్లపై, నిర్మాణ ప్రదేశాల్లో ఏర్పడే దుమ్ము, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కూడా ముఖ్యమైన కారణాలే.

గతంలో కూడా.. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఆడ్-ఈవెన్ విధానం వంటి చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ విధానంలో వాహనాల నంబర్ల ఆధారంగా కొన్ని రోజుల్లో కొన్ని వాహనాలకే రోడ్లపై తిరిగే అవకాశం ఇచ్చారు. అయితే.. ఢిల్లీ కాలుష్య సమస్య చాలా పెద్దది కావడంతో ఒక్క చర్యతోనే దాన్ని పూర్తిగా పరిష్కరించడం సాధ్యం కాదు.

ఇక శీతాకాలంలో పంజాబ్, హర్యానా వంటి పొరుగు రాష్ట్రాల్లో పంట అవశేషాలను కాల్చడం వల్ల వచ్చే పొగ కూడా ఢిల్లీ గాలి నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే కాకుండా.. పొరుగు రాష్ట్రాలు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: మీ పేరుతో సిమ్ కార్డు ఉందా.. జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement