అమ్మాయ్ ...కూనిరాగం తీయ్ | Humming is believed to be a surprisingly effective tool for managing stress | Sakshi
Sakshi News home page

అమ్మాయ్ ...కూనిరాగం తీయ్

Aug 23 2026 12:46 AM | Updated on Aug 23 2026 12:46 AM

Humming is believed to be a surprisingly effective tool for managing stress

నో స్ట్రెస్‌ ప్లీజ్‌ 

పాట రాకపోయినా పర్లేదు. రాగం తెలియకపోయినా పర్లేదు. గొంతు బొంగురుగా ఉన్నా సరే. పెదవులు మూసి ఒక్క ‘హమ్‌’ చేస్తే మనసు తేలికవుతుంది. హమ్మింగ్‌ ప్రతి ఒక్కరి ప్రజాస్వామిక హక్కు. దానికి గురువు అక్కర్లేదు. శ్రోతలు అక్కర్లేదు. అందుకే ‘హమ్‌’ చేయండి... స్ట్రెస్‌ని దూరం పెట్టండి... అంటున్నారు నిపుణులు.

మీలో చాలామందికి ఒక బాధ. ‘పాట పాడాలని ఉంది... కానీ గొంతు సహకరించదు’ అని. పాట పాడాలంటే సాధన చేయాలి. తాళం కుదరాలి. సాహిత్యం గుర్తుండాలి. ఇన్ని రూల్స్‌. అందుకే సంగీతం అనేది కొందరి గేటెడ్‌ కమ్యూనిటీ అయిపోయింది. మిగతావారు బయట నిలబడి వింటున్నారు. కానీ ఇప్పుడు ఆ గేట్లు బద్దలయ్యాయి. పాస్‌వర్డ్‌ దొరికిపోయింది.

ఆ పాస్‌వర్డ్‌ పేరే ‘హమ్మింగ్‌’. 
సిగ్గు లేకుండా, భయం లేకుండా, మీకోసం మీరు పాడుకునే ఏకైక పద్ధతి. థెరపిస్టులు కూడా దీన్ని ‘పర్సనల్‌ వెల్‌–బీయింగ్‌ క్యాటలిస్ట్‌’ అంటున్నారు. ఎందుకంటే అది మీ నెర్వస్‌ సిస్టమ్‌ను శాంతపరుస్తుంది. కూనిరాగంతో కోటి ప్రయోజనాలు మరి.

స్త్రీలకు హమ్మింగ్‌ కవచం
రోజంతా ఇంటి పని, ఆఫీస్‌ పని, పిల్లల హోంవర్క్, వండాలి, వార్చాలి, అందరి మూడ్స్‌ చూసుకోవాలి. ‘నాకు టైమ్‌ లేదు’ అని చెప్పలేని ఉద్యోగం స్త్రీలది. మధ్యలో స్ట్రెస్‌ వచ్చినప్పుడు మీకు కావాల్సింది 10 నిమిషాల మెడిటేషన్‌ కాదు. ఒక్క రెండు నిమిషాల ‘హమ్‌’. పెదవి విప్పి పాడితే ‘ఇంట్లో పనీపాటా లేదా’ అని అడిగే వారుంటారు. కానీ హమ్మింగ్‌కి పెదవి తెరవనక్కర్లేదు. గొంతు సవరించుకోనక్కర్లేదు. ప్రెజర్‌ కుక్కర్‌ విజిల్స్‌ మధ్యలోనే మీరు మీ మనసును కుదుటపరచుకోవచ్చు. ఎవరి అనుమతీ అక్కర్లేని మీ స్వేచ్ఛ.

వేళాపాళా లేదు
మీరు శంకర శాస్త్రిలా పేరు గడించాలంటే ఆ తంతు వేరు. దానికి గురువు దొరకాలి... ఏళ్ల తరబడి సాధన... ప్రదర్శన... కానీ హమ్మింగ్‌కు ఆ గొడవే లేదు. దానికి వాద్యబృందం అక్కర్లేదు. మీరు నైటీలో ఉన్నా, ఆఫీస్‌ ఫార్మల్స్‌లో ఉన్నా సరిపోతుంది. సాహిత్యం తప్పయితే ఎవరూ కరెక్షన్  చేయరు. ఎందుకంటే సాహిత్యమే ఉండదు. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ మగ్‌తో నీళ్లు పోసుకునేప్పుడైనా సరే... మీ ఫీలింగ్‌ని గొంతులో వదలండి. అది అచ్చమైన స్వేచ్ఛ. అందులో మీరే రాజ్యాంగం, మీరే చట్టం.

మీలోనూ సంగీతం
పాట అనేది కొందరి గొంతుల్లో బందీ అయిపోయింది. హమ్మింగ్‌ దాన్ని విడిపించింది. సంగీతం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మీ లోపలా ఉంది. కాబట్టి, రేపటి నుంచి పని మధ్యలో టెన్షన్ వస్తే, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే, ఎవరితోనైనా గొడవ పడి మూడ్‌ అవుట్‌ అయితే ఒక పని చేయండి. దీర్ఘంగా ఊపిరి పీల్చి, మెల్లగా ‘హమ్మ్‌’ అనండి. పాట రాకపోతే బాధపడకండి. హమ్‌ ఉంది కదా. అది చాలు హాయిగా బతికేయడానికి. అలసిన స్త్రీ గొంతులో సంగీతం పలకాలి. అదే నిజమైన సంగీత ప్రజాస్వామ్యం.

సైన్స్ ఏం చెబుతోందంటే..?
హమ్‌ చేసేటప్పుడు మీరు ఒక పద్ధతిలో ఊపిరి వదులుతారు. దీన్నే ‘బ్రీత్‌ వర్క్‌’ అంటారు. అలా చేసినప్పుడు మీ బ్రెయిన్ లోని ‘ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌’ మోడ్‌ ఆఫ్‌ అయి, ‘రెస్ట్‌ అండ్‌ డైజెస్ట్‌’ మోడ్‌ ఆన్ అవుతుంది. గుండె వేగం తగ్గుతుంది, బీపీ కంట్రోల్‌ అవుతుంది, ఆందోళన మాయమవుతుంది. అందుకే సూదిలో దారం ఎక్కించాలన్నా, ఆఫీస్‌లో క్లిష్టమైన మెయిల్‌ టైప్‌ చేయాలన్నా, కొడుకు పంపిన మెసేజ్‌కు అర్థం ఏంటో డీకోడ్‌ చేయాలన్నా ముందు రెండు నిమిషాలు హమ్‌ చేయండి. మీ కాన్సన్‌ట్రేషన్  డబుల్‌ అవుతుంది. ఈ కల్లోల కాలంలో ఇంత చీప్‌ అండ్‌ బెస్ట్‌ థెరపీ మరొకటి లేదు. 

అందుకే జస్ట్‌ ‘హమ్‌’ చేయండి. పెదవులు మూసి, కళ్లు మూసి, మీకు నచ్చిన ట్యూన్ ను గొణగండి. అది సినిమా పాట కావచ్చు, చిన్నప్పుడు అమ్మ పాడిన జోల కావచ్చు, లేదా మీకే తెలియని కొత్త రాగం కావచ్చు. శ్రోతలు ఎవరూ జడ్జ్‌ చేయరు. ఎందుకంటే మీరు పాడటం లేదు. మీ ఫీలింగ్‌ను వైబ్రేట్‌ చేస్తున్నారు. అదే దాని అందం. మీ ఆడియన్స్ ఒక్కరే... మీరు. మీకు నచ్చితే చాలు. మీ మనసు కుదుటపడితే చాలు. అదే ఫస్ట్‌ ప్రైజ్‌.

కె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement