ఇన్‌ఫ్రా ఖర్చులకు రెక్కలు.. రూ.3.4 లక్షల కోట్ల భారం! | Infrastructure Project Costs Surge Rs 3 4 Lakh Crore Extra Burden | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రా ఖర్చులకు రెక్కలు.. రూ.3.4 లక్షల కోట్ల భారం!

Aug 26 2026 2:21 AM | Updated on Aug 26 2026 2:21 AM

Infrastructure Project Costs Surge Rs 3 4 Lakh Crore Extra Burden

న్యూఢిల్లీ: మౌలిక(ఇన్‌ఫ్రా) సదుపాయాల ప్రాజెక్టుల వ్యయాలు భారీగా పెరిగిపోయినట్లు నెలవారీ ప్రభుత్వ నివేదిక పేర్కొంది. రూ. 150 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులపై ఉమ్మడిగా రూ. 3.4 లక్షల కోట్లమేర వ్యయాల భారం పడినట్లు 2026 జూలైకు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 17 కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల ద్వారా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మొత్తం 1,775 ప్రాజెక్టుల వ్యయాలు రూ. 33,70,138 కోట్ల నుంచి రూ. 37,10,642 కోట్లకు చేరినట్లు వివరించింది.

అయితే.. ఎన్ని ప్రాజెక్టులలో అంచనాలకు మించి వ్యయాలు పెరిగిందీ వెల్లడించలేదు. వీటిపై మొత్తం రూ. 19.26 లక్షల కోట్లు వెచ్చించగా.. సవరించిన అంచనా వ్యయాలలో ఇవి 51.91 శాతానికి సమానమని గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. నిలకడగా ప్రాజెక్టుల అభివృద్ధి జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రాజెక్టులలో అధిక భాగం చివరి దశకు చేరుకున్నట్లు తెలియజేసింది. 675(38 శాతం) ప్రాజెక్టు పనులు నిర్మాణపరం(ఫిజికల్‌)గా 80 శాతం పూర్తికాగా.. మరో 305(17 శాతం) ప్రాజెక్టులు ఫైనాన్షియల్‌గా 80 శాతానికి మించి  పూర్తయినట్లు వెల్లడించింది.

ప్రాజెక్టుల వివరాలివీ
రవాణా, లాజిస్టిక్స్‌ రంగంలో అత్యధికంగా 1,246 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా.. రూ. 19.81 లక్షల కోట్ల సవరించిన అంచనాలు కనెక్టివిటీ ఆధారిత మౌలికసదుపాయాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1,775 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో రూ. 1,000 కోట్లకుపైబడిన మెగా ప్రాజెక్టులు 735 ఉన్నట్లు వెల్లడించింది.

వీటి అసలు అంచనా వ్యయాలు రూ. 28.77 లక్షల కోట్లుకాగా.. 1,040 ప్రధాన(రూ. 1,000 కోట్ల నుంచి రూ. 150 కోట్లవరకూ) ప్రాజెక్టుల అంచనా వ్యయాలు రూ. 4.93 లక్షల కోట్లుగా తెలియజేసింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అధిక సంఖ్యలో 993(56 శాతం) ప్రాజెక్టులను కలిగి ఉంది. మొత్తం సవరించిన ప్రాజెక్టుల అంచనా వ్యయాలలో వీటి వాటా రూ. 9.62 లక్షల కోట్లు(26 శాతం)గా తెలియజేసింది. ఇది జాతీయస్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పట్టిచూపుతున్నట్లు పేర్కొంది.

ఇతర శాఖల ద్వారా.. 
గణాంకాల శాఖ నివేదిక ప్రకారం రైల్వే శాఖ 190 ప్రాజెక్టులను(11 శాతం) అభివృద్ధి చేస్తోంది. వీటి మొత్తం సవరించిన అంచనా వ్యయాలు రూ. 6.38 లక్షల కోట్లు(17 శాతం). బొగ్గు శాఖ ప్రాజెక్టులు 121(7 శాతం)కాగా.. వీటి సవరించిన ప్రాజెక్టు వ్యయాలు రూ. 2.22 లక్షల కోట్లు(6 శాతం). పెట్రోలియం, సహజవాయువు, విద్యుత్, గృహాలు, పట్టణ వ్యవహారాలు, నీటి వనరులు, నదుల అభివృద్ధి తదితర శాఖలు వరుసగా 103, 98, 50, 38 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.

వీటి సవరించిన అంచనా వ్యయాలు వరుసగా రూ. 4.23 లక్షల కోట్లు, రూ. 6.08 లక్షల కోట్లు, రూ. 3.78 లక్షల కోట్లు, రూ. 2.01 లక్షల కోట్లు. మిగిలిన 182 ప్రాజెక్టుల(10 శాతం) అంచనా వ్యయాలు రూ. 2.78 లక్షల కోట్లు(8 శాతం)కాగా.. ఇవి ఉన్నత విద్య, పౌర విమానయానం, స్టీల్, టెలికమ్యూనికేషన్స్, కారి్మకులు, ఉపాధి, పోర్టులు, షిప్పింగ్, జల రవాణా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గనులు, డీపీఐఐటీ, క్రీడల శాఖల ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నట్లు నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement