పార్లమెంటు సభ్యుల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై పార్లమెంటు సభ్యులు దక్షిణ మధ్య రైల్వే అధికారులను నిలదీశారు. పనుల్లో వేగం పెంచి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గురువారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(కొంతభాగం) మహారాష్ట్ర(కొంతభాగం)లకు చెందిన పార్లమెంటు సభ్యులతో జోన్ జీఎం సంజీవ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర ఉన్నతాధికారులు రైల్‌నిలయంలో భేటీ నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు మొత్తం 16 మంది ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నగరానికి తూర్పు వైపు చర్లపల్లి టెరి్మనల్‌ను నిర్మించినట్లుగానే పశ్చిమ దిశలో ఈదుల నాగులపల్లి వద్ద టెరి్మనల్‌ను నిర్మించాలని ఎంపీ రఘునందన్‌రావు కోరారు. కోవిడ్ సమయంలో నిలిచిపోయిన పలు రైళ్లను ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదని, వాటన్నింటినీ వెంటనే తిరిగి ప్రారంభించాలని ఖమ్మం ఎంపీ రఘురామ్‌రెడ్డి తెలిపారు. భద్రాచలానికి నేరుగా రైల్వే కనెక్టివిటీ కల్పించాలని, పాండురంగాపురం నుంచి భద్రాచలానికి రైల్వే లింక్ ఇవ్వాలని, కొత్తగూడెంను ప్రత్యేక రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు.
కేంద్రప్రభుత్వం ఎన్ని రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసినా, రాష్ట్రప్రభుత్వం సకాలంలో భూమిని సేకరించి అందివ్వకుంటే ఎలాంటి ఫలితం ఉండదని, అన్ని రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రప్రభుత్వం వేగంగా భూసేకరణ చేసి సహకరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల తెలిపారు. మల్కాజిగిరిలో ఉత్తర భారతీయులు ఎక్కువగా ఉన్నందున, వారి సొంత ప్రాంతాలకు మరిన్ని రైళ్లు మంజూరు చేయాలన్నారు. విద్యార్థులకు ప్రయోజనకరమైన ‘ఇజ్జత్ పాస్’పథకాన్ని రద్దు చేయడం ఏమాత్రం సహేతుకం కాదని ఎంపీ బలరామ్‌నాయక్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గానికి రూ.వేయి కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేయించుకున్నామని, వీటికి సంబంధించి పలు ప్రాంతాల్లో భూసేకరణ అంశం కలెక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. తెలంగాణలో రూ. 2వేల కోట్లకు పైగా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని, రూ.24,210 కోట్ల వ్యయంతో 1,481 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని జీఎం శ్రీవాస్తవ తెలిపారు.


