బలోపేతం దిశగా బీజేపీ! | Sunil Bansal Appointed BJP State Incharge: Telangana | Sakshi
Sakshi News home page

బలోపేతం దిశగా బీజేపీ!

Oct 5 2026 6:01 AM | Updated on Oct 5 2026 6:01 AM

Sunil Bansal Appointed BJP State Incharge: Telangana

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా సునీల్‌ బన్సల్‌కు బాధ్యతలు 

వ్యూహరచనను అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం 

నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం 

ఎమ్మెల్సీ ఎన్నికలు, సేవా సంకల్ప్, పార్టీ సంస్థాగత విషయాలపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతోపాటు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్టం కావాల్సిన అవసరాన్ని గుర్తించిన అధిష్టానం.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా సునీల్‌బన్సల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. సహ ఇన్‌చార్జ్‌లుగా అభయ్‌ పాటిల్, రేఖాశర్మను నియమించింది. వీరు వచ్చిరాగానే తమ వ్యూహరచనను అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు.

వారితోపాటు సంస్థాగత కార్యదర్శి మధుకర్, సంయుక్త కార్యదర్శి దశరథ్‌ కూడా రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించే బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌లో మధుకర్, దశరథ్, అభయ్‌పాటిల్‌ ఉంటారు. 

బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, సేవా సంకల్ప్‌ అభియాన్, పార్టీ సంస్థాగత, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బీజేపీ బలాన్ని పెంచేలా ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నట్టు సమాచారం.  

ఖైరతాబాద్‌ ఉపపోరుపై .. 
వచ్చే ఏడాది ఉమ్మడి వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు స్థానాలను కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. పట్టభద్ర ఓటర్ల నమోదు నుంచి ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం వరకు సమగ్ర కార్యాచరణ రూపొందించే అవకాశముంది. 

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఖైరతాబాద్‌ను కూడా బీజేపీ నాయకత్వం కీలక రాజకీయ అవకాశంగా చూస్తున్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. స్థానికంగా పార్టీ బలాబలాలు, సామాజిక సమీకరణాలు, గత ఎన్నికల ఫలితాలు, ప్రత్యర్థి పార్టీల పరిస్థితిపై సమగ్రంగా అధ్యయనం చేసి అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచార వ్యూహం వరకు కార్యాచరణ రూపొందించనున్నట్టు సమాచారం.

వచ్చే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా.. 
తెలంగాణలో బీజేపీలో ఇన్నాళ్లుగా సంస్థాగతంగా ఎదురవుతున్న సమస్యలను చక్కదిద్దడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల అమలు, కీలక పదవుల భర్తీ, అసంతృప్తి నేతలను సమన్వయం చేయడం వంటి అంశాలను అధిష్టానం పరిశీలించనున్నట్టు సమాచారం. పార్టీ బలోపేతానికి అడ్డుగా మారుతున్న అంశాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే దిశగా ఇన్‌చార్జ్‌ల కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే ఎన్నికల మోడ్‌లోకి తీసుకెళ్లేలా నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా.. తెలంగాణలో బీజేపీని కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధిష్టానం కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement