సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సర్ పేరును ప్రస్తావించకుండా జరుగుతున్న ఓట్ల తొలగింపు ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలే చేశారాయన. కోట్లాది మంది పౌరులను ఓటు హక్కుకు దూరం చేసే ఏ ప్రక్రియ అయినా సహజంగానే ఏకపక్షమైనదని, అది రాజ్యాంగానికి మూలమైన వ్యవస్థనే దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారాయన. అదే సమయంలో.. నల్సార్ విద్యార్థులను ‘ధైర్యవంతులు’ అంటూ ఆయన ప్రశంసలు గుప్పించడం వాడివేడి చర్చకు దారి తీసింది.
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన 19వ జస్టిస్ బీఆర్ సావ్నీ మెమోరియల్ మూట్ కోర్టు పోటీ ముగింపు కార్యక్రమంలో జస్టిస్ భూయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ఆర్టికల్ 14లకు విరుద్ధంగా కోట్లాది మందిని ఓటు హక్కు నుంచి దూరం చేసే ప్రక్రియ ఉండకూడదన్నారు. భారత రాజ్యాంగం ఓటు హక్కు ఉన్న పౌరులు, ఓటు హక్కు లేని పౌరులు అంటూ రెండు తరగతులను సృష్టించదని స్పష్టం చేశారు.
ఓటు హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలక భాగమని పేర్కొన్న ఆయన.. ఏ అధికారం కూడా ఆర్టికల్ 326ను దెబ్బతీయలేదని అన్నారు. అలాంటి ప్రక్రియను ఏ కోర్టూ సమర్థించలేదని వ్యాఖ్యానించారు. ‘‘మిలియన్ల మందిని ఓటు హక్కు నుంచి దూరం చేసే ప్రక్రియను ఎలాంటి వాదనలతోనూ సమర్థించలేం’’ అంటూ ‘వాట్‌అబౌటరీ’ని కూడా ప్రస్తావించారు
SIRపై నేరుగా పేరు చెప్పకపోయినా..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై రాజకీయంగా, న్యాయపరంగా చర్చ జరుగుతున్న సమయంలోనే భూయాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తన ప్రసంగంలో ఆయన సర్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఓటు హక్కును భారీ స్థాయిలో తొలగించే ఏ ప్రక్రియ అయినా రాజ్యాంగపరంగా సమస్యాత్మకమవుతుందని ఆయన విస్తృతంగా వ్యాఖ్యానించారు.
ఎవరీ జస్టిస్ ఉజ్జల్ భూయాన్?
1964 ఆగస్టు 2న అసోంలోని గువాహటిలో జన్మించిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. సీనియర్ న్యాయవాది, అసోం మాజీ అడ్వొకేట్ జనరల్ సుచేంద్రనాథ్ భూయాన్ కుమారుడు. కిరోరీమల్ కాలేజీలో డిగ్రీ, గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, గువాహటి యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు.
1991లో న్యాయవాదిగా నమోదు చేసుకుని.. గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2011లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2013లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం బాంబే హైకోర్టు, తెలంగాణ హైకోర్టుల్లో పనిచేశారు. 2022 జూన్‌లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2023 జూలై 14న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
విద్యార్థులపై కూడా ప్రశంసలు
ఇదే కార్యక్రమంలో నల్సార్ విద్యార్థులను కూడా జస్టిస్ భూయాన్ ప్రశంసించారు. వారు ‘‘బ్రిలియంట్, బోల్డ్, బ్రేవ్’’ అంటూ కొనియాడారు. అయితే ఇటీవల నల్సార్ విద్యార్థుల నిరసనకు సంబంధించిన వివాదాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. తన ప్రసంగం చివర్లో మాత్రం ప్రముఖ న్యాయవేత్త నాని పాల్కీవాలా వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. స్వేచ్ఛను ఒక తరం నుంచి మరో తరానికి అందించాలంటే ప్రతి తరం దానిని కాపాడేందుకు, దాని కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని జస్టిస్ భూయాన్ గుర్తుచేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. గతంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలు అన్నారని పెద్ద ఉద్యమమే పుట్టుకొచ్చింది. అయితే తాను నకిలీ లాయర్లను ఉద్దేశించే అలా అన్నానని తర్వాత వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన మీద అసంతృప్తి కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే.. నల్సార్‌లో ఆ మధ్య చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చీఫ్‌గెస్ట్‌గా ఓ కార్యక్రమం జరగాల్సి ఉండేది. అయితే ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం తమకు ఇష్టం లేదంటూ కొందరు స్టూడెంట్స్ కాలేజీ మేనేజ్‌మెంట్‌కు లేఖ రాయడం, దీనిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీరియస్ కావడం.. ఆ వెంటనే ఆ లా స్టూడెంట్స్‌పై చర్యలకు ఆదేశించడం, సీజేఐ జోక్యం చేసుకుని బార్ కౌన్సిల్ తీరును తప్పుబట్టడం, టోటల్‌గా ఆ కార్యక్రమం రద్దు కావడం.. చర్చనీయాంశమయ్యాయి.
కొసమెరుపు ఏంటంటే.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ భూయాన్ నల్సార్ యూనివర్సిటీకి ఎక్స్‌అఫిషియో ఛాన్సలర్‌గా కూడా వ్యవహరించారు. సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత కూడా న్యాయ విద్యా రంగంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
సూర్యకాంత్‌తో కలిసి..
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో జస్టిస్ భూయాన్ కలిసి పని చేసిన అనుభవం ఉంది. 2023లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ భూయాన్‌ను సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసిన కొలీజియంలో అప్పటి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడిగా ఉన్నారు. అంటే సూర్యకాంత్ ఆయన్ని సుప్రీం కోర్టు జడ్జిగా నియమించేందుకు సంబంధించిన కొలీజియం ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నారన్నమాట. అలాగే భూయాన్, సూర్యకాంత్ గతంలో ఒకే బెంచ్‌లో కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2024లో కేజ్రీవాల్ బెయిల్ కేసు విచారణ జరిపిన బెంచ్‌లో ఈ ఇద్దరూ ఉన్నారు.
ఇదీ చదవండి: లంచం కేసులో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్


