హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే ఎన్నిక రద్దయినట్లు కోర్టులు తీర్పులు వెలువడించిన నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజక వర్గంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఆదివారం బంజారాహిల్స్‌లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో ఖైరతాబాద్ సీనియర్‌నేత, భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్ధన్ నిర్వహించిన భారీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అన్ని పార్టీల నేతలను ఆకర్షించింది.
సుమారు 2 వేలమందికిపైగా వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పల్లపు గోవర్ధన్ మాట్లాడుతూ ఖైరతాబాద్ నియోజక వర్గం అభివృద్ధిలో వెనుకబడిందని బస్తీలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఎంతో మంది ఉద్దండులు ఈ నియోజక వర్గాన్ని పాలించినప్పటికీ కనీసం మెటర్నిటి ఆస్పత్రి, జూనియర్ కాలేజీ కూడా కట్టలేదని మండిపడ్డారు.
హైందవ శక్తులను ఒక్కతాటిపైకి తీసుకురావడంతో పాటు సమస్యల పరిష్కారానికై తన కార్యచరణ ప్రణాళిక ఉండబోతుందని తెలిపారు. త్వరలోనే నియోజక వర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు, తన అభిమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రాజకీయంగా తన అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయో చెప్తానని వెల్లడించారు.


