డీసీసీ అధ్యక్షులకు ప్రొటోకాల్‌! | Telangana govt directs formation of Indiramma committees for housing scheme | Sakshi
Sakshi News home page

డీసీసీ అధ్యక్షులకు ప్రొటోకాల్‌!

Oct 5 2026 5:54 AM | Updated on Oct 5 2026 5:54 AM

Telangana govt directs formation of Indiramma committees for housing scheme

ఇందిరమ్మ కమిటీలకు జిల్లా చైర్మన్లుగా నియమించే యోచనలో ప్రభుత్వం 

తద్వారా వారికి అధికారిక హోదా..ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత 

సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నియామకం 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలనలో ఫైలు.. త్వరలో ఉత్తర్వులు!

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులకు అధికారిక ప్రొటోకాల్‌ లభించే దిశగా అడుగులు పడుతున్నాయి. వారిని ఇందిరమ్మ కమిటీలకు జిల్లా చైర్మన్లుగా నియమించే యోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్టు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఎంపికతో సహా అనేక దశల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు గాను అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కమిటీలకు ఎమ్మెల్యేలు చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ కమిటీలను జిల్లా స్థాయికి విస్తరించి డీసీసీ అధ్యక్షులను వాటికి చైర్మన్లుగా ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇక ఈ కమిటీల్లో.. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను సభ్యులుగా నియమించున్నారు. జిల్లా స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్న ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఫైలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద పరిశీలనలో ఉందని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశముందని ప్రభుత్వ వర్గాల సమాచారం.  

అటు ప్రొటోకాల్‌.. ఇటు ప్రాధాన్యత 
ఇందిరమ్మ కమిటీల జిల్లా చైర్మన్లుగా డీసీసీ అధ్యక్షులను నియమించడం ద్వారా స్వామి కార్యం, స్వకార్యం నెరవేరుతుందనే భావనతో ప్రభుత్వం ఉంది. వారికి ప్రభుత్వ పరంగా ప్రొటోకాల్‌కు అవకాశం లభించడంతో పాటు ఇటు పార్టీలో డీసీసీ అధ్యక్షుల ప్రాధాన్యతా పెరగనుంది. నిజానికి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులకు పార్టీ పరంగా విస్తృతస్థాయిలో అధికారాలివ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ల ఖరారు కోసం నియమించే కమిటీల్లో కూడా వారికి స్థానం కల్పించాలని, భవిష్యత్తులో జిల్లా పార్టీ అధ్యక్షులే ఆయా జిల్లాల్లోని పార్టీ యంత్రాంగానికి సుప్రీం కావాలనేది అధిష్టానం ఆలోచన.

అదే కోణంలో రాష్ట్రంలోనూ సంఘటన సృజన్‌ అభియాన్‌ అనే కార్యక్రమం ద్వారా ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకుల సిఫారసు మేరకు డీసీసీ అధ్యక్షులను నియమించారు. కానీ చాలాచోట్ల వీరికి ఆశించిన ప్రాధాన్యత లభించడం లేదు. ఇన్‌చార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు కనీస సమాచారం ఇవ్వడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే కార్యక్రమాలకు కూడా వీరికి ఆహా్వనం అందడం లేదు. మరికొన్ని చోట్ల అయితే కనీసం పార్టీ తరఫున ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో కూడా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల ఫోటోలను పెట్టడం లేదు. 

ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షులకు పారీ్టలో ప్రాధాన్యత పెంచడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు వీలుగా వారిని ఇందిరమ్మ కమిటీలకు జిల్లా చైర్మన్లుగా నియమించాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ ప్రతిపాదించినట్టు సమాచారం. కాగా ఈ ప్రతిపాదనకు కార్యరూపం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement