లక్నో: పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల సమస్యలపై ఉత్తరప్రదేశ్‌లోని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. లక్నోలోని దుబగ్గ ప్రాంతంలోని జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ విద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ బాలాగంజ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అయితే, మూడు రోజుల క్రితం కూడా ఇదే పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల కొరత, పాఠశాలలోని వసతులపై నిరసనకు దిగారు. ఆ సమయంలో కన్నౌజ్ వెళ్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అధికారులు తమ కాన్వాయ్‌ను నిలిపి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులను త్వరగా నియమిస్తామని హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో విద్యార్థులు మరోసారి రోడ్డుపైకి వచ్చారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ విద్యార్థుల నిరసనలు కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాలేదు. ఫతేపూర్, హమీర్‌పూర్, బిహార్, రాజస్థాన్‌లోని బార్మేర్, జాలోర్, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, సిరోంజ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ పాఠశాల విద్యార్థులు వివిధ సమస్యలపై ఆందోళనలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
హమీర్‌పూర్‌లో గ్రామానికి రహదారి లేకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 'చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలనుకుంటున్నాం.. కానీ పాఠశాలకు వెళ్లే దారే ఇలా ఉంటే ఎలా' అని విద్యార్థులు వారి ఇబ్బంది పరిస్థితులను చెప్పుకొచ్చారు. మరోవైపు అల్వార్‌లో పాఠశాల పైకప్పు దెబ్బతినడంతో భద్రతపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. కన్నౌజ్‌లో పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో విద్యార్థులు ఆ భోజనాన్ని బహిష్కరించినట్లు సమాచారం.
అయితే, ఉత్తరప్రదేశ్ నుంచి పలు రాష్ట్రాలకు చేరుకున్న ఈ విద్యార్థుల ఆందోళనలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రత, నాణ్యమైన భోజనం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యార్థులు స్వయంగా రోడ్డెక్కడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.


