breaking news
teacher shortages
-
లక్నో వీధుల్లో ‘జెన్ ఆల్ఫా’ ఆగ్రహం.. నిరసనలకు కారణాలివే!
లక్నో: పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల సమస్యలపై ఉత్తరప్రదేశ్‌లోని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. లక్నోలోని దుబగ్గ ప్రాంతంలోని జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ విద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయుల కొరతను నిరసిస్తూ బాలాగంజ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.అయితే, మూడు రోజుల క్రితం కూడా ఇదే పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల కొరత, పాఠశాలలోని వసతులపై నిరసనకు దిగారు. ఆ సమయంలో కన్నౌజ్ వెళ్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అధికారులు తమ కాన్వాయ్‌ను నిలిపి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులను త్వరగా నియమిస్తామని హామీ ఇచ్చారు. అయితే మూడు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో విద్యార్థులు మరోసారి రోడ్డుపైకి వచ్చారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.ఈ విద్యార్థుల నిరసనలు కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాలేదు. ఫతేపూర్, హమీర్పూర్, బిహార్, రాజస్థాన్‌లోని బార్మేర్, జాలోర్, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, సిరోంజ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ పాఠశాల విద్యార్థులు వివిధ సమస్యలపై ఆందోళనలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.హమీర్‌పూర్‌లో గ్రామానికి రహదారి లేకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 'చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలనుకుంటున్నాం.. కానీ పాఠశాలకు వెళ్లే దారే ఇలా ఉంటే ఎలా' అని విద్యార్థులు వారి ఇబ్బంది పరిస్థితులను చెప్పుకొచ్చారు. మరోవైపు అల్వార్‌లో పాఠశాల పైకప్పు దెబ్బతినడంతో భద్రతపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. కన్నౌజ్‌లో పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో విద్యార్థులు ఆ భోజనాన్ని బహిష్కరించినట్లు సమాచారం.అయితే, ఉత్తరప్రదేశ్ నుంచి పలు రాష్ట్రాలకు చేరుకున్న ఈ విద్యార్థుల ఆందోళనలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రత, నాణ్యమైన భోజనం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాఠశాల విద్యార్థులు స్వయంగా రోడ్డెక్కడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. -
వారినెందుకు క్రమబద్ధీకరించరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంటే సమస్యకు కొంతవరకైనా పరిష్కారం చూపినట్లు అవుతుందని అభిప్రాయపడింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంది. తాము ప్రభుత్వాన్ని నడపడం లేదని, అందువల్ల ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వడం లేదని, అయితే కేవలం సూచనలు మాత్రమే చేస్తున్నామని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, శాశ్వత ప్రాతిపదికన టీచర్ల పోస్టుల భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జున్‌కుమార్ రాష్ట్రంలో దాదాపు 1,800 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరని చెప్పడంతో విస్మయం వ్యక్తంచేసిన ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మంగళవారం నాటి విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాణిరెడ్డి ధర్మాసనం కోరిన వివరాలను సమర్పించారు. ఈ వివరాలను పరిశీలించిన ధర్మాసనం 988 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపింది. ఈ కొరతను తీర్చేందుకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని వాణిరెడ్డి తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం విద్యావలంటీర్ల గురించి ఆరా తీసింది. వారి అర్హతలు ఏమిటని ప్రశ్నించింది. సాధారణ ఉపాధ్యాయులకున్న అర్హతలే వీరికి కూడా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో, అయితే వారిని ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని ప్రశ్నించింది. -
టీచర్ల తాత్కాలిక సర్దుబాటుకు గ్రీన్‌సిగ్నల్
చిత్తూరు(టౌన్): పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు రాజీవ్ విద్యామిషన్ చర్యలు చేపట్టింది. టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు (రేషనలైజేషన్) చేసేందుకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాష్ట్ర ఆర్వీఎం అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో దీని వివరాలను జిల్లా విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులకు వివరించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని సర్దుబాటు చేయాలని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో టీచర్లు సరిగ్గా లేనందున విద్యార్థులకు చదువు చెప్పలేకపోతున్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తే గానీ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరదు. ప్రస్తుతం డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేనందున తాత్కాలిక సర్దుబాటు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటుచేసి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. రెండు రోజులు సరిపోతుందా? సర్దుబాటు పూర్తి చేయడానికి రెండు రోజులు సరిపోదని, వారం రోజులైనా గడువిస్తే పూర్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎక్కువగా సబ్జెక్టు టీచర్లు ఉం డే పాఠశాల నుంచి వీరిని సర్దుబాటు ప్రాతిపదికన వేరే పాఠశాలకు పంపాల్సి ఉంటుంది. సెలవుల్లో అధికారులే సర్దుబాటు చేసేందుకు పూనుకొని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి దీనికి పెద్దగా స్పందన రాలేదు. అధికారుల వద్ద జిల్లాలో ఎన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి? టీచర్లు లేని పాఠశాలలు ఎన్ని? ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఎంత ఉంది? అనే వివరాలు పూర్తి స్థాయిలో లేవు. పాఠశాలలు పునఃప్రారంభమైనందున పిల్లల ఎన్రోల్మెంట్పై దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంఈవోల నుంచి వివరాలు తెప్పించుకొని సర్దుబాటు చేయడమనేది కత్తిమీద సామేనని చెప్పొచ్చు. అధికారులకు తలనొప్పులు తప్పవా? తాత్కాలిక సర్దుబాటు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కొంత మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు జీవోలు తెచ్చుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక సర్దుబాటు కార్యక్రమం వీరికి వరంలా దొరికింది. కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీరిని పట్టుకొని తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒత్తిళ్లు ఎక్కువైతే నిబంధనలకు అధికారులు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇటీవల నిర్వహించిన ఎంఈవోల సమావేశంలో తాత్కాలిక సర్దుబాబు చేయాలని డీఈవో ఆదేశాలు ఇవ్వడంతో చాలా మంది తాము కోరుకున్న చోటుకి వెళ్లేందుకు ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పుడు ఉన్నతాధికారులు అధికారికంగా అనుమతి ఇవ్వడంతో అధికార పార్టీ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.


