వారినెందుకు క్రమబద్ధీకరించరు?

High Courts on educational volunteers - Sakshi

విద్యావలంటీర్ల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

విధాన నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచన  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఓ విధానపరమైన నిర్ణయం తీసుకుంటే సమస్యకు కొంతవరకైనా పరిష్కారం చూపినట్లు అవుతుందని అభిప్రాయపడింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంది. తాము ప్రభుత్వాన్ని నడపడం లేదని, అందువల్ల ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వడం లేదని, అయితే కేవలం సూచనలు మాత్రమే చేస్తున్నామని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, శాశ్వత ప్రాతిపదికన టీచర్ల పోస్టుల భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ఎంవీ ఫౌండేషన్‌ కన్వీనర్‌ ఆర్‌.వెంకట్‌రెడ్డి హైకోర్టులో  పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది అర్జున్‌కుమార్‌ రాష్ట్రంలో దాదాపు 1,800 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరని చెప్పడంతో విస్మయం వ్యక్తంచేసిన ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మంగళవారం నాటి విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాణిరెడ్డి ధర్మాసనం కోరిన వివరాలను సమర్పించారు.

ఈ వివరాలను పరిశీలించిన ధర్మాసనం 988 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపింది. ఈ కొరతను తీర్చేందుకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తామని వాణిరెడ్డి తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం విద్యావలంటీర్ల గురించి ఆరా తీసింది. వారి అర్హతలు ఏమిటని ప్రశ్నించింది. సాధారణ ఉపాధ్యాయులకున్న అర్హతలే వీరికి కూడా ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పడంతో, అయితే వారిని ఎందుకు క్రమబద్ధీకరించడం లేదని ప్రశ్నించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top