మయన్మార్‌లో మరో ప్రళయం.. వణికిస్తున్న చైనా మెగా డ్యామ్! | China Resumes Controversial Myitsone Dam Project in Myanmar | Sakshi
Sakshi News home page

మయన్మార్‌లో మరో ప్రళయం.. వణికిస్తున్న చైనా మెగా డ్యామ్!

Aug 16 2026 9:22 AM | Updated on Aug 16 2026 9:22 AM

China Resumes Controversial Myitsone Dam Project in Myanmar

నేపిడా: మయన్మార్‌లో ఎప్పుడో నిలిచిపోయిన వివాదాస్పద మైత్సోన్ జల విద్యుత్ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాచిన్ రాష్ట్రంలో చైనా సహకారంతో నిర్మంచ తలపెట్టిన ఈ భారీ ఆనకట్ట నిర్మాణంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 15 ఏళ్ల క్రితం ప్రజా వ్యతిరేకత కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. తాజాగా మిన్ ఆంగ్ హ్లైంగ్ చైనా పర్యటన తర్వాత దీనికి మళ్లీ ఊతమిచ్చారు.

మాలి, నమై నదుల సంగమ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇది పూర్తయితే సింగపూర్ దేశ అంతర్గత వైశాల్యానికి సమానమైన భారీ జలాశయం ఏర్పడుతుంది. దీని ద్వారా సుమారు ఆరు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. అయితే, పర్యావరణ ముప్పు, స్థానికుల నిర్వాసిత సమస్యల నేపథ్యంలో అప్పట్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 2011లో నాటి అధ్యక్షుడు తేయిన్ సీన్ దీని నిర్మాణాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం మయన్మార్‌ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది.

దేశంలో మొత్తం పది గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, ఈ ప్రాజెక్టు ద్వారా ఆ అవసరంలో సగానికి పైగా తీరవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సింహభాగం చైనాకు తరలిపోతుందనే అపనమ్మకం వ్యక్తమవుతోంది. భౌగోళికంగా ఈ ప్రాంతం భూకంప ముప్పునకు కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఐదు వందల అడుగుల ఎత్తైన ఈ భారీ ఆనకట్ట నిర్మాణం లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ జలాశయం వల్ల దిగువ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును శాశ్వతంగా రద్దు చేయాలని కోరుతూ సివిల్ సొసైటీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం భద్రతా చర్యలపై సమీక్షలు నిర్వహిస్తూ, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: బెంగాల్‌లో హైటెన్షన్‌.. మమత సన్నిహితుడు దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement