తెలుసుకుందాం
పిల్లలూ... ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం...
ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు కేవలం ఇండియాను మాత్రమే కాదు... ప్రపంచంలోని చాలా దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. నిజం చె΄్పాలంటే ప్రస్తుతం ఉన్న దేశాల లెక్కల ప్రకారం సుమారు 65కి పైగా దేశాలు ఏదో ఒక సమయంలో బ్రిటిష్ వారి పాలన కింద ఉన్నాయి! 1920ల నాటికి ప్రపంచంలోని దాదాపు నాలుగో వంతు భూభాగం వారి అధీనంలోనే ఉండేది. అందుకే ఆ రోజుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ‘సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం’ అని పిలిచేవారు. అంటే, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట వారి పాలనలో ఉన్న దేశంలో పగలు ఉంటూనే ఉండేదన్నమాట!
మనకు స్వాతంత్య్రం వచ్చినట్టే, వారి నుంచి విముక్తి పొందిన కొన్ని ముఖ్యమైన దేశాలు ఇవే:
మన పొరుగు దేశాలు: పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ (బర్మా), మలేషియా.
పెద్ద దేశాలు: ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్.
ఆఫ్రికా దేశాలు: దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, కెన్యా, నైజీరియా.
ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారి కిందే ఉండేది! వాళ్లు మన కంటే చాలా ముందే (1776లో) బ్రిటిష్ వారిని తరిమికొట్టి స్వాతంత్య్రం తెచ్చుకున్నారు.
బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన ఈ దేశాలన్నీ కలిసి తర్వాత ‘కామన్వెల్త్’ అనే ఒక పెద్ద గ్రూప్‌గా ఏర్పడ్డాయి. ఇందులో మన ఇండియాతో కలిపి మొత్తం 56 దేశాలు ఉన్నాయి.
చూశారా... ఎంతమందిని ఇబ్బంది పెట్టిన పరాయి పాలన అయినా ప్రజలంతా కలిసికట్టుగా పోరాడితే ఒకరోజు లొంగిపోక తప్పదు. అదే స్వాతంత్య్రం మనకు నేర్పిన గొప్ప పాఠం!


