మంచి సినిమాల నిర్మాణంలో ఈశాన్య రాష్ట్రాల మహిళా దర్శకులు ప్రతిభ చూపుతూనే ఉన్నారు. అస్సామీ దర్శకురాలు రిమా దాస్ ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో గుర్తింపు పొందగా ఇప్పుడు ‘బూంగ్’ సినిమాతో మణిపూర్ దర్శకురాలు లక్ష్మీప్రియా దేవి 2026 బ్రిటిష్ అకాడెమీ అవార్డ్స్ బరిలో ఎంట్రీ సాధించారు. ఈశాన్య రాష్ట్రాల బాలల భావోద్వేగాలు ‘బూంగ్’లో ఆకట్టుకున్నాయి. దర్శకురాలి గురించి, చిత్రం గురించి విశేషాలు....
సినిమా రంగంలో ప్రతిభ బాలీవుడ్‌లోనో దక్షిణాదిలోనో ఉందనే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఈశాన్య రాష్ట్రాల మహిళా దర్శకులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. వారి వరుసన లక్ష్మీప్రియా దేవి చేరారు. తన తొలి చిత్రం ‘బూంగ్’ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ కథ విని ఫర్హాన్ అఖ్త్తర్ వంటి దిగ్గజాలు నిర్మాతగా మారారంటే ఈ సినిమా కథ ఎంతగా ఆకట్టుకునేలా ఉందో ఊహించవచ్చు. ఈశాన్య రాష్ట్రాల కథలు లోకానికి తెలియాలనే దృష్టితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకో వచ్చు.
‘బూంగ్’ 2024 టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘డిస్కవరీ’ విభాగంలో ప్రదర్శితమై మొదటగా వార్తలలో నిలిచింది. ఇప్పుడు 2026 ఆఅఊఖీఅ (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డ్సు పోటీలో నామినేషన్ దక్కించుకుని మరింత ఘనత సాధించింది. ఉత్తమ బాలల–కుటుంబ చిత్రాల కేటగిరీలో బూంగ్ ఎంపికైంది. వచ్చే నెల ప్రకటించనున్న అవార్డులలో ‘బూంగ్’ గెలిస్తే లక్ష్మీప్రియ దేవి వల్ల ఈశాన్య రాష్ట్రాల సినిమాకు మరింత గుర్తింపు వస్తుంది.
ఏమిటి ఈ ‘బూంగ్’?
2024లో మణిపురి భాషలో లక్ష్మీప్రియాదేవి తెరకెక్కించిన చిత్రం ‘బూంగ్’. ఇది బూంగ్ అనే స్కూల్ పిల్లాడి కథ. ఆ పిల్లవాడు తప్పి΄ోయిన తన తండ్రి జాయ్‌కుమార్‌ని, తన తల్లి మందాకినిని తిరిగి కలపడం కోసం తన స్వస్థలం నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని మోరే వరకు ప్రయాణించడమే ఇందులోని కథ. బూంగ్ తండ్రి బతికే ఉన్నాడా, అతనికి ఏమైంది, ఈ ప్రయాణంలో బూంగ్‌కు ఎదురైన అనుభవాలేమిటనేది లక్ష్మీప్రియదేవి ఆసక్తికరంగా, గుండె చలించేలా చిత్రించారు.
ఇది ఒక రకంగా లక్ష్మీప్రియదేవికి బాగా తెలిసిన కథ. తన బాల్యంలో చుట్టూ ఉన్న పరిస్థితులే బూంగ్ కథకు అంకురార్పణ చేశాయని అంటారు లక్ష్మీప్రియదేవి. ఈ చిత్రం తన మణిపుర్ జ్ఞాపకాలలోని తీపి చేదు సమ్మేళనంలాంటిది అంటారు. పరాయివారి పట్ల ద్వేషం, మతవిద్వేషం, వేర్పాటువాదం వంటి అనేక సమస్యలను ‘బూంగ్’ కథలో స్పృశించారు. ఇందులోని మెయిటీ బాలుడి పాత్రను కుకీ–జో వర్గానికి చెందిన గుగున్ కిప్జెన్ పోషించాడు.
మణిపుర్ అల్లర్లకు వారం ముందు...
2023లో మణì పుర్‌లో అల్లర్లు జరిగేందుకు సరిగ్గా వారం ముందు లక్ష్మీప్రియ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఆ విషయం తలుచుకుంటే ఇప్పటికీ తన ఒళ్లు జలదరిస్తుందంటారామె. ఆ సమయంలో స్థానికంగా కొంత ఘర్షణ వాతావరణం ఉందని, అయితే అది ఈ స్థాయిలోకి మారుతుందని తాను ఊహించలేదని వివరిస్తున్నారామె. ‘బూంగ్’ సినిమా మోరే పట్టణానికి సంబంధించిన చివరి డాక్యుమెంటేషన్. తమ సినిమాలో చూపిన ప్రదేశాలు, ప్రజలు మళ్లీ ఎప్పటికీ మునుపటిలా ఉండరని ఆమె ఆవేదన చెందుతున్నారు. తమ సిబ్బంది బస చేసిన ప్రదేశాలూ, అక్కడి వారు నివసించిన ఇళ్లూ అన్నీ ధ్వంసమయ్యాయని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు.
బాలీవుడ్ చిత్రాలకు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా...
మణిపుర్‌లో పుట్టి పెరిగిన లక్ష్మీప్రియ మాస్ కమ్యూనికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఫర్హాన్ అక్తర్ తీసిన ‘లక్ష్య’ (2004), రాజ్‌కుమార్ హిరానీ తీసిన ‘పికె’ (2014) చిత్రాలకు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే దర్శకత్వంపై ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కేవలం కథలు రాయాలనేదే ఆమె ఆలోచన. ఈ క్రమంలో ‘బూంగ్’ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. దాన్ని రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ దగ్గరికి తీసుకువెళ్లగా వాళ్ళు ఆ సినిమా చేద్దాం అన్నారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది.


