అమెరికా వర్సిటీని వణికించిన భారతీయ జంట
ఒక చిన్న మైక్రోవేవ్ ఓవెన్.. అందులో వేడెక్కుతున్న పాలక్ పనీర్.. ఆ వాసన నచ్చని ఒక బ్రిటిష్ స్టాఫ్ మెంబర్. అక్కడితో మొదలైన చిన్న గొడవ.. అంతర్జాతీయ స్థాయి న్యాయపోరాటంగా మారిపోయింది. చివరికి అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ మోకాళ్ల మీదకొచ్చి 200,000 డాలర్లు (సుమారు రూ.1.83 కోట్లు) చెల్లించేలా చేసింది. ఇది కేవలం డబ్బు కోసం జరిగిన పోరాటం కాదు, భారతీయతపై జరిగిన దాడికి ఎదురు దెబ్బ!.
అసలేం జరిగిందంటే..
యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్‌లో పీహెచ్‌డీ చేస్తు న్న ఆదిత్య ప్రకాశ్, తన లంచ్ బాక్స్‌లోని పాలక్ పనీర్ ను వేడి చేస్తుండగా ఒక బ్రిటిష్ స్టాఫ్ మెంబర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ఈ వాసన ఘాటుగా ఉంది.. ఇక్కడ ఇలాంటివి వేడి చేయకూడదు’.. అని హుకుం జారీ చేశాడు. ‘శాండ్‌విచ్‌లు ఓకే కానీ.. కూరలు వద్దు’.. అంటూ ఆ నిబంధన వెనుక ఉన్న వివక్షను బయట పెట్టాడు. ఇది కేవలం వాసన గురించి కాదని, తన ‘భారతీయత’పై జరిగిన దాడిగా ఆదిత్య భావించారు.
అణచివేత మొదలైందిలా..
దీనిపై ప్రశ్నించినందుకు ఆదిత్య ప్రకాశ్, అతని కాబోయే భార్య ఊర్మి భట్టాచార్యలపై వర్సిటీ యాజమాన్యం ప్రతీకార చర్యలకు దిగింది. వారి పరిశోధనలకు నిధులను నిలిపివేసింది. టీచింగ్ రోల్స్ నుంచి తొలగించింది. నెలల తరబడి పనిచేసిన పీహెచ్‌డీ అడ్వైజర్లు కూడా దూరం జరిగేలా ఒత్తిడి తెచ్చింది. చివరికి వారు చెప్పిన పాఠాల్లో ‘సాంస్కృతిక వివక్ష’ గురించి ప్రస్తావించినా, సోషల్ మీడియాలో తమ ఆవేదన పంచుకున్నా.. ‘మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి’.. అంటూ జాత్యహంకార వేధింపులు ఎదురయ్యాయి.
తిరగబడ్డ భారతీయ జంట
తమ కెరీర్‌ను పణంగా పెట్టి అయినా సరే, ఆహార వివక్ష (ఫుడ్ రేసిజం)పై పోరాడాలని భారతీయ జంట నిర్ణయించుకుంది. దీనిపై 2025 మే నెలలో సివిల్ రైట్స్ కింద కోర్టులో కేసు వేశారు. ‘మేము భారతీయులం కాబట్టే మా ఆహారాన్ని, మా సంస్కృతిని చిన్నచూపు చూస్తున్నారు’.. అని గళమెత్తారు. చివరకు వర్సిటీ దిగివచ్చి భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించింది. బాధిత విద్యార్థులకు 200,000 డాలర్లు (సుమారు రూ.1.83 కోట్లు) పరిహారం చెల్లించాలని.. వారి పీహెచ్‌డీ డిగ్రీలను వెంటనే ప్రదానం చేయాలని కోర్టు తీర్పు చెప్పింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


