university of colorado
-
పాలక్ పనీర్ ఘాటు..
ఒక చిన్న మైక్రోవేవ్ ఓవెన్.. అందులో వేడెక్కుతున్న పాలక్ పనీర్.. ఆ వాసన నచ్చని ఒక బ్రిటిష్ స్టాఫ్ మెంబర్. అక్కడితో మొదలైన చిన్న గొడవ.. అంతర్జాతీయ స్థాయి న్యాయపోరాటంగా మారిపోయింది. చివరికి అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ మోకాళ్ల మీదకొచ్చి 200,000 డాలర్లు (సుమారు రూ.1.83 కోట్లు) చెల్లించేలా చేసింది. ఇది కేవలం డబ్బు కోసం జరిగిన పోరాటం కాదు, భారతీయతపై జరిగిన దాడికి ఎదురు దెబ్బ!.అసలేం జరిగిందంటే..యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్‌లో పీహెచ్డీ చేస్తు న్న ఆదిత్య ప్రకాశ్, తన లంచ్ బాక్స్‌లోని పాలక్ పనీర్ ను వేడి చేస్తుండగా ఒక బ్రిటిష్ స్టాఫ్ మెంబర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ఈ వాసన ఘాటుగా ఉంది.. ఇక్కడ ఇలాంటివి వేడి చేయకూడదు’.. అని హుకుం జారీ చేశాడు. ‘శాండ్విచ్లు ఓకే కానీ.. కూరలు వద్దు’.. అంటూ ఆ నిబంధన వెనుక ఉన్న వివక్షను బయట పెట్టాడు. ఇది కేవలం వాసన గురించి కాదని, తన ‘భారతీయత’పై జరిగిన దాడిగా ఆదిత్య భావించారు.అణచివేత మొదలైందిలా..దీనిపై ప్రశ్నించినందుకు ఆదిత్య ప్రకాశ్, అతని కాబోయే భార్య ఊర్మి భట్టాచార్యలపై వర్సిటీ యాజమాన్యం ప్రతీకార చర్యలకు దిగింది. వారి పరిశోధనలకు నిధులను నిలిపివేసింది. టీచింగ్ రోల్స్ నుంచి తొలగించింది. నెలల తరబడి పనిచేసిన పీహెచ్డీ అడ్వైజర్లు కూడా దూరం జరిగేలా ఒత్తిడి తెచ్చింది. చివరికి వారు చెప్పిన పాఠాల్లో ‘సాంస్కృతిక వివక్ష’ గురించి ప్రస్తావించినా, సోషల్ మీడియాలో తమ ఆవేదన పంచుకున్నా.. ‘మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి’.. అంటూ జాత్యహంకార వేధింపులు ఎదురయ్యాయి.తిరగబడ్డ భారతీయ జంటతమ కెరీర్‌ను పణంగా పెట్టి అయినా సరే, ఆహార వివక్ష (ఫుడ్ రేసిజం)పై పోరాడాలని భారతీయ జంట నిర్ణయించుకుంది. దీనిపై 2025 మే నెలలో సివిల్ రైట్స్ కింద కోర్టులో కేసు వేశారు. ‘మేము భారతీయులం కాబట్టే మా ఆహారాన్ని, మా సంస్కృతిని చిన్నచూపు చూస్తున్నారు’.. అని గళమెత్తారు. చివరకు వర్సిటీ దిగివచ్చి భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించింది. బాధిత విద్యార్థులకు 200,000 డాలర్లు (సుమారు రూ.1.83 కోట్లు) పరిహారం చెల్లించాలని.. వారి పీహెచ్డీ డిగ్రీలను వెంటనే ప్రదానం చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కూలింగ్ కాగితం
వేసవి వస్తే ఇంట్లో ఏసీలు ఫుల్‌స్పీడ్‌లో పనిచేస్తాయి. మనకింకా అంత పరిస్థితి లేదుగానీ... పాశ్చాత్య దేశాల్లో చలికాలంలోనూ ఇళ్లను వెచ్చబెట్టుకునేందుకు ఏసీలు వాడాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ ఏసీలతో కరెంటు బిల్లు మోత మోగుతుందనేది మాత్రం నిజం. కానీ సమీప భవిష్యత్తులో అసలు కరెంటే అవసరం లేకుండా ఇళ్లు, భవనాలను చల్లగా ఉంచుకోవచ్చునని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు. ఫొటోలో ఓ ప్లాస్టిక్ కాగితం లాంటిది పట్టుకుని కనిపిస్తున్న వారే ఈ శాస్త్రవేత్తలు. వారి చేతుల్లో ఉన్నది ఆషామాషీ ప్లాస్టిక్ కాగితం కాదండోయ్! గాజు, ప్లాస్టిక్‌ల మిశ్రమాల ప్రత్యేక పదార్థం. దీన్ని భవనంపై అతికించుకుంటే చాలు.. సూర్యుడి నుంచి వచ్చే వేడిలో చాలాభాగాన్ని అడ్డుకోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. పాసివ్ కూలింగ్ అన్న భౌతికశాస్త్ర సూత్రం ఆధారంగా ఈ కొత్త పదార్థం పనిచేస్తుంది. సూర్యకిరణాల వేడిని ఇన్ఫ్రారెడ్ కిరణాలుగా మార్చివేయడం దీని ప్రత్యేకత. ఈ ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఇంటి లోపలికి ప్రవేశించకుండా నేరుగా బయటకు వెళ్లిపోతాయి. కేవలం 50 మైక్రాన్ల మందం మాత్రమే ఉండే ఈ పదార్థం ప్రతి చదరపు మీటరు ద్వారా దాదాపు 110 వాట్ల మేరకు వేడిని అడ్డుకుంటుందని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త జియాబో ఇన్ అంటున్నారు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు అని... కాగితాన్ని ప్రింట్ చేసినట్టుగానే దీన్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చునని ఇన్ అంటున్నారు. కేవలం ఇళ్లను చల్లగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా.. దీన్ని సోలార్ ప్యానెల్స్‌పై అతికించడం ద్వారా ప్యానెల్స్ సామర్థ్యాన్ని ఒకట్రెండు శాతం ఎక్కువ చేసుకోవచ్చునని చెబుతున్నారు. అన్నట్టు.. విద్యుత్తు, నీళ్ల అవసరం ఏమాత్రం లేకుండా రోజుల కొద్దీ పనిచేయడం ఈ కాగితం ప్రత్యేకత. ఈ ఏడాది 200 చదరపు మీటర్ల వైశాల్యంతో ఓ కూలింగ్ ఫార్మ్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రత్యేక పదార్థాన్ని పరీక్షిస్తామని, ఫలితాలను బట్టి కొన్ని మార్పులు, చేర్పులు చేసి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని అంటున్నారు కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమాకి కాంబినేషన్ మెడిసిన్!
చైల్డ్‌హుడ్ ఆస్తమా అని పిలిచే చిన్నపిల్లల ఆస్తమాకు మరింత మేలైన మందును రూపొందించారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని మెడిసిన్ విభాగంలో జరిగిన పరిశోధనల్లో ఈ మందును రూపొందించారు. ఆస్తమా వచ్చినప్పుడు మూసుకుపోయే గాలి మార్గాలు ఈ మందు వల్ల తెరచుకుంటాయి. ‘‘దీని వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఒనగూరతాయి. మొదటిది ఆస్తమా వచ్చినప్పుడు కలిగే ఇన్ఫ్లమేషన్ను ఇది తగ్గిస్తుంది. రెండోది... ఆస్తమాలో సన్నబారిన గాలి మార్గాలను విశాలంగా చేస్తుంది. ఈ రెండు ప్రయోజనాల వల్ల ఇది మరింత ప్రయోజనకారి’’ అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పిల్లల వైద్య పరిశోధనల్లో పాలుపంచుకున్న పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ స్టాన్లీ జెఫ్లర్. ప్రస్తుతం ఇది ఎంత సురక్షితం అన్న అంశంపై పరిశీలనలు జరుగుతున్నాయి. -
ఆ రోజుల్లోనే బాడీ పెయింటింగ్!
బాడీ పెయింటింగ్ అనేది నిన్నటి మొన్నటి విషయం కాదని, 49,000 సంవత్సరాల క్రితమే ఇది ఉనికిలో ఉందని అంటోంది యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో పరిశోధక బృందం. దీనికి సంబంధించిన ఆధారాలను ఇటీవల దక్షిణ ఆఫ్రికాలోని సిబుడు గుహల్లో ఈ బృందం కనుగొంది. పాలు, జేగురుమన్ను కలిపి గోడలపై పెయింటింగ్‌లు వేసేవారు. ఇదే మిశ్రమంతో బాడీ పెయింటింగ్ కూడా వేసుకునేవారు. జేగురుమన్నుతో చిత్రాలు వేయడం గురించిన ఆధారాలను కనుగొనడం కొత్తేమీ కాకపోయినప్పటికీ జేగురుమన్ను, పాల మిశ్రమాలతో వేసిన చిత్రాలను కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. జేగురుమన్నును పాలతో మాత్రమే కాకుండా చెట్టు బంక, గుగ్గిలాలను కలిపి పెయింట్‌గా తయారుచేసేవారట. ఆరోజుల్లో దక్షిణ ఆఫ్రికా ఆదిమ తెగల్లో బాడీ పెయింటింగ్ అనేది బాగా వాడుకలో ఉండేదని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో పరిశోధక బృందం చెబుతోంది. నమీబియాలో ఆదిమవాసులు ఇప్పటికీ జేగురురంగు మన్ను, వెన్న మిశ్రమంతో బాడీ పెయింట్ చేసుకుంటారు.


