కూలింగ్ కాగితం
విద్యుత్తు, నీళ్ల అవసరం ఏమాత్రం లేకుండా రోజుల కొద్దీ పనిచేయడం ఈ కాగితం ప్రత్యేకత.
వేసవి వస్తే ఇంట్లో ఏసీలు ఫుల్‌స్పీడ్‌లో పనిచేస్తాయి. మనకింకా అంత పరిస్థితి లేదుగానీ... పాశ్చాత్య దేశాల్లో చలికాలంలోనూ ఇళ్లను వెచ్చబెట్టుకునేందుకు ఏసీలు వాడాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ ఏసీలతో కరెంటు బిల్లు మోత మోగుతుందనేది మాత్రం నిజం. కానీ సమీప భవిష్యత్తులో అసలు కరెంటే అవసరం లేకుండా ఇళ్లు, భవనాలను చల్లగా ఉంచుకోవచ్చునని అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు.
ఫొటోలో ఓ ప్లాస్టిక్ కాగితం లాంటిది పట్టుకుని కనిపిస్తున్న వారే ఈ శాస్త్రవేత్తలు. వారి చేతుల్లో ఉన్నది ఆషామాషీ ప్లాస్టిక్ కాగితం కాదండోయ్! గాజు, ప్లాస్టిక్‌ల మిశ్రమాల ప్రత్యేక పదార్థం. దీన్ని భవనంపై అతికించుకుంటే చాలు.. సూర్యుడి నుంచి వచ్చే వేడిలో చాలాభాగాన్ని అడ్డుకోవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. పాసివ్ కూలింగ్ అన్న భౌతికశాస్త్ర సూత్రం ఆధారంగా ఈ కొత్త పదార్థం పనిచేస్తుంది. సూర్యకిరణాల వేడిని ఇన్ఫ్రారెడ్ కిరణాలుగా మార్చివేయడం దీని ప్రత్యేకత. ఈ ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఇంటి లోపలికి ప్రవేశించకుండా నేరుగా బయటకు వెళ్లిపోతాయి. కేవలం 50 మైక్రాన్ల మందం మాత్రమే ఉండే ఈ పదార్థం ప్రతి చదరపు మీటరు ద్వారా దాదాపు 110 వాట్ల మేరకు వేడిని అడ్డుకుంటుందని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త జియాబో ఇన్ అంటున్నారు.
దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు అని... కాగితాన్ని ప్రింట్ చేసినట్టుగానే దీన్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చునని ఇన్ అంటున్నారు. కేవలం ఇళ్లను చల్లగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా.. దీన్ని సోలార్ ప్యానెల్స్‌పై అతికించడం ద్వారా ప్యానెల్స్ సామర్థ్యాన్ని ఒకట్రెండు శాతం ఎక్కువ చేసుకోవచ్చునని చెబుతున్నారు. అన్నట్టు.. విద్యుత్తు, నీళ్ల అవసరం ఏమాత్రం లేకుండా రోజుల కొద్దీ పనిచేయడం ఈ కాగితం ప్రత్యేకత. ఈ ఏడాది 200 చదరపు మీటర్ల వైశాల్యంతో ఓ కూలింగ్ ఫార్మ్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రత్యేక పదార్థాన్ని పరీక్షిస్తామని, ఫలితాలను బట్టి కొన్ని మార్పులు, చేర్పులు చేసి మార్కెట్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని అంటున్నారు కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్


