ఇరాన్‌ సుప్రీం నేత ఖరారు? | Iran has a new Supreme Leader Top clerical body keeps name under wraps amid war | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సుప్రీం నేత ఖరారు?

Mar 9 2026 5:33 AM | Updated on Mar 9 2026 5:38 AM

Iran has a new Supreme Leader Top clerical body keeps name under wraps amid war

పేరు బయట పెట్టని కమిటీ 

టెహ్రాన్‌: ఇరాన్‌ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఆయన వారసుని ఎంపిక పూర్తయినట్లు వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పేరును ఇప్పుడే బహిర్గతం చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త సుప్రీం నేతకు కూడా ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయెల్‌ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ‘కొత్త నేతను ఎన్నుకున్నాం’ అని కమిటీ సభ్యుడు అయతొల్లా మొహమ్మద్‌ మెహ్‌దీ మిర్బాఖేరీ చెప్పారు. ‘‘అయితే ఇంకొన్ని అవరోధాలున్నాయి. వాటిని పరిష్కరించాకే ఆయన పేరు వెల్లడిస్తాం’’ అన్నారు.

సుప్రీంనేత ఎంపిక కోసం జరిపే సమావేశంపై సభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దాడుల వేళ భద్రతా కారణాల రీత్యా సమావేశం అక్కర్లేదని, ఎవరికి మద్దతు పలికేదీ సూచిస్తే చాలని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డట్టు అయతొల్లా మొహ్‌సీన్‌ హైదరీ అలేకాసిర్‌ చెప్పారు. మరికొందరేమో ఏదేమైనా కమిటీ భేటీ కావాల్సిందేనని పట్టుబట్టారు. ‘‘సుప్రీంనేత ఎంపిక పూర్తయింది. పేరును అసెంబ్లీ సెక్రటరీ అయతొల్లా హషీం హొస్సేనీ బుషేరీ వెల్లడిస్తారు’’ అని మరో సభ్యుడు అహ్మద్‌ అలామొల్హొదా చెప్పారు. దివంగత ఖమేనీ కుమారుడు 56 ఏళ్ల ముజ్తాబా ఖమేనీనే సుప్రీం నేతగా ఎన్నుకుని ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 

ముజ్తాబా గాయపడ్డారా? 
తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్‌ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్‌ చనిపోవడం తెల్సిందే. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్‌ అదెల్‌ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్‌ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్‌ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంత∙సాయుధ విభాగం ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement