ఫీనిక్స్: అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే విమాన సంఖ్యతో ప్రయాణిస్తున్న రెండు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలు ఒకదానికొకటి అతి సమీపానికి రాగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఫీనిక్స్ స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చికాగో నుంచి వస్తున్న ఒక విమానం, ఫీనిక్స్ నుంచి బయలుదేరిన మరో విమానం అనుకోకుండా ఒకే విమాన సంఖ్య ‘అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2482’తో నడిచాయి. విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా చికాగో వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో, ప్రత్యామ్నాయ విమానాన్ని సంస్థ కేటాయించింది. అయితే, పొరపాటున రెండు విమానాలకు ఒకే నంబరు కేటాయించబడటంతో అవి ఒకే గగనతలంలోకి ప్రవేశించి ఒకదానికొకటి ఎదురుపడే పరిస్థితి ఏర్పడింది.
ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే అప్రమత్తమయ్యారు. రాకపోకలు సాగిస్తున్న ఆ రెండు విమానాలను విడివిడిగా గుర్తించి, వాటి మధ్య తగిన ఎత్తు వ్యత్యాసాన్ని (వెర్టికల్ సెపరేషన్) కాపాడారు. రావలసిన విమానాన్ని ఎత్తులోనే ఉంచాలని, బయలుదేరిన విమానం ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా నియంత్రించాలని ఆదేశాలు జారీ చేశారు. కంట్రోలర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో రెండు విమానాలూ సురక్షిత దూరంలో ప్రయాణించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇది కూడా చదవండి: జార్ఖండ్‌లో విద్యార్థుల రణరంగం: 20న సీఎం నివాసం ముట్టడి!


