దిస్పూర్: ఇటీవల అస్సాంలో జరిగిన విమాన ప్రమాదంలో లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణాంతరం అందించిన పరిహారం విషయంలో ఇప్పుడు తీవ్ర వివాదం చెలరేగుతుంది. ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన రూ.21 లక్షల చెక్కును తమకు తెలియకుండా తన భార్య అనే చెప్పబడే మహిళకు ఇచ్చారని ఆమె కనీసం తన కర్మకాండలకు కూడా ఉండకుండా వెళ్లిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
అసోంలోని జోర్హాట్ సమీపంలో జరిగిన భారత వైమానిక దళ (IAF) విమాన ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బీహార్‌లోని జహానాబాద్ జిల్లాకు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ ఒకరు. బీహార్ ప్రభుత్వం అమర జవాను కుటుంబానికి రూ. 21 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందించింది. ఈ చెక్కును అధికారులు శుభమ్ కుమార్ భార్య అయిన శ్రేయా రాయ్‌కి అందజేశారు. అయితే శుభమ్ కుమార్‌కు పెళ్లి అయిన విషయమే తమకు తెలియదని అతని తల్లిదండ్రులు చెప్పడంతో ఈ వివాదం మొదలైంది.
అయితే తన కొడుకుకు పెళ్లైన సంగతే తనకు తెలియదని నవంబర్ నెలలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేయడానికి ఇంట్లో ఏర్పాట్లుజరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే శ్రేయాతో శుభమ్ కుమార్ అంతకుముందే రహస్యంగా కోర్టు వివాహం చేసుకున్నాడని అధికారులు తెలిపారని ఆ విషయంతో వారు చెప్పే వరకూ తనకు తెలియదన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు ఆ చెక్కును ఆమెకు ఎలా ఇచ్చేస్తారని ఆయన ప్రశ్నించారు. కొడుకు చనిపోయిన తర్వాత శ్రేయా రాయ్ తమ ఇంటికి వచ్చిందని అయితే కర్మకాండలు పూర్తి కాకముందే ఆమె అధికారులతో మాట్లాడి రూ. 21 లక్షల చెక్కును తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయిందని శుభమ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
పరిహారం తీసుకున్నప్పుడు బాధ్యతలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉంటుంది కదా అని ఆయన ప్రశ్నించారు. తమ కుటుంబం అంతా కొడుకు సంపాదన పైనే ఆధారపడి బతుకుతోందని, ఇప్పుడు తమను రోడ్డున పడేశారని వాపోయారు. అయితే వైమానిక దళ నిబంధనల నిబంధనల ప్రకారం అమర జవాన్ల భార్యలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం ఆ చెక్కును ఆమెకు అందజేసిందని అధికారులు తెలిపారు.
అయితే ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చకు దారి తీసింది. చట్టపరమైన హక్కులు ఒకవైపు ఉంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత సైతం మరొకవైపు ఉంటుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


